Share News

గంటలో చేరేదెలా?

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:23 AM

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను భేతాళ ప్రశ్న వేధిస్తోంది.

గంటలో చేరేదెలా?

భోగాపురం విమాన ప్రయాణికులకు భేతాళ ప్రశ్న!

జాతీయ రహదారిపై స్పీడ్‌ లిమిట్‌ 40 కి.మీ.

విశాఖ-భీమిలి బీచ్‌ మార్గంలోనూ అదే వేగ పరిమితి

విమానాశ్రయానికి త్వరగా చేరుకునే మార్గమేది?

కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను భేతాళ ప్రశ్న వేధిస్తోంది. విమానం అందుకోవాలనే ఆత్రంతో జాతీయ రహదారిపై వేగంగా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పోలీసులు జరిమానా కూడా వేస్తారు. నిబంధనల ప్రకారం నెమ్మదిగా వెళితే అధిక సమయం పడుతుంది. ఈ రెండింటిలో ఏది మంచిదనే దానిపై సందిగ్ధం నెలకొంది. ప్రయాణ సమయం ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు.

సిటీ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మూడు నెలల క్రితమే విశాఖపట్నంలో వాహనాలు ఏ మార్గంలో, ఎంత వేగంతో వెళ్లాలో నిబంధనలు విధించారు. నిర్దేశిత వేగం దాటితే లేజర్‌గన్‌లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తూ చలానాలు పంపుతున్నారు. అన్ని మార్గాల్లోను స్పీడ్‌ లిమిట్‌ను సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి 50 కి.మీ. దూరాన్ని గంట సమయంలో తీసుకెళతామని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయాణ సమయం 1.30 గంటలుందని, కొత్తగా వేసిన మాస్టర్‌ప్లాన్‌ రహదారులతో ఆ సమయం గంటకు తగ్గుతుందని అంటున్నారు. అలా చేరుకోవాలంటే కచ్చితంగా ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లాలి. వేగ పరిమితి దాటితే పోలీసుల చలానాలకు సిద్ధపడాలి.

గంటలో ఎలా వెళ్లగలరు.?

ప్రస్తుతం విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్‌, మద్దిలపాలెం, సీతమ్మధార, బీచ్‌ రోడ్డుల నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కనీసం గంటన్నర సమయం పడుతోంది. అదే సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య అయితే మరో పది నిమిషాలకంటే ఎక్కువే పడుతోంది. విశాఖపట్నం విమానాశ్రయం మూసివేస్తే ప్రయాణికులు అంతా భోగాపురమే వెళ్లాలి. రోజూ పదివేల మంది ప్రయాణికులు జాతీయ రహదారి, ఆనందపురం హైవేల మీదుగా భోగాపురం వెళ్లాలి. అంటే ఇటు వైపు ట్రాఫిక్‌లో అదనంగా మరో పదివేల వాహనాలు చేరుతాయి. ప్రయాణ సమయం ఇంకా ఎక్కువ అవుతుంది.

పోలీసులు పెట్టిన ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ గంటకు 40 కి.మీ. పరిమిత వేగంతో వెళుతూ మధ్యలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు తాటిచెట్లపాలెం జంక్షన్‌, అక్యయ్యపాలెం, గురుద్వాద, సత్యం జంక్షన్‌, మద్దిలపాలెం, ఇసుకతోట, హనుమంతవాక, ఆదర్శనగర్‌, ఎండాడ, క్రికెట్‌ స్టేడియం, కారుషెడ్‌ జంక్షన్‌, కొమ్మాది జంక్షన్లలో రెండు నిమిషాల చొప్పున ఆగితే 24 నిమిషాలు సిగ్నల్‌ వెయిటింగ్‌కే పడుతుంది. గంటన్నర ప్రయాణం, మరో 24 నిమిషాలు వెయిటింగ్‌ వెరసి రెండు గంటలు పడుతుంది. ఈ ప్రయాణ సమయాన్ని గంటకు ఎలా కుదిస్తారో వివరించాల్సి ఉంది. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు సిటీలో స్పీడ్‌ లిమిట్స్‌ను మారుస్తారా? ప్రమాదాలు జరిగినా సర్దుకుపోతారా? కీలక జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించడానికి అంగీకరిస్తారా? చెప్పాల్సి ఉంది. ఆర్టీసీ అధికారులు భోగాపురానికి నడిపే ఈ-బస్సులకు స్పీడ్‌ లిమిట్‌ లేకుండా అనుమతులు ఇస్తారేమో చూడాలి.

ఇవీ పోలీసుల స్పీడ్‌ లిమిట్స్‌

40 కి.మీ. వేగం - ఎన్‌హెచ్‌-16పై కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు, బీచ్‌ రోడ్డులో ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకు, బాజీ జంక్షన్‌ నుంచి కంచరపాలెం మెట్టు వరకు, అన్ని జీవీఎంసీ రహదారులు, బీఆర్‌టీఎస్‌ మార్గాల్లో ఇదే వేగంతో వెళ్లాలి.

50 కి.మీ. వేగం - పరవాడలో ఈ-మర్రిపాలెం నుంచి కూర్మన్నపాలెం వరకు, హనుమంతవాక జంక్షన్‌ నుంచి అడవివరం వరకు, కాన్వెంట్‌ జంక్ష్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు, కొమ్మాది జంక్షన్‌ నుంచి ఆనందపురం జంక్షన్‌ వరకు ఈ వేగం అనుమతిస్తారు.

Updated Date - Jun 17 , 2026 | 12:23 AM