Share News

నిండు గర్భిణికి ఎన్ని కష్టాలో..

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:44 PM

మండలంలోని పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి రహదారి సదుపాయం లేక ఒక నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు మూడు కిలోమీటర్ల మేర డోలీలో, కాలినడకన తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.

నిండు గర్భిణికి ఎన్ని కష్టాలో..
గర్భిణిని నడిపిస్తున్న దృశ్యం

మూడు కిలోమీటర్లు డోలీలో, కాలినడకన తరలించాల్సిన దుస్థితి

మార్గమధ్యంలో ప్రసవం

ఇందుగుల గ్రామానికి రహదారి లేక అవస్థలు

జి.మాడుగుల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి రహదారి సదుపాయం లేక ఒక నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు మూడు కిలోమీటర్ల మేర డోలీలో, కాలినడకన తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇందుగుల గ్రామానికి చెందిన సీదరి దేవి(27)కి సోమవారం మఽధ్యాహ్నం పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమెను కుటుంబ సభ్యులు కొంత దూరం డోలీలో, మరికొంత దూరం కాలినడకన.. ఇలా మూడు కిలోమీటర్లు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవం అయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడ నుంచి ఇదులదరువుకు తీసుకొచ్చారు. అక్కడ 108 వాహనం సిద్ధంగా ఉండడంతో అందులో తల్లీబిడ్డను జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్య సేవలు అందించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:44 PM