Share News

సొంతగూడు లేని కార్యాలయాలెన్నో?

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:27 AM

మండలంలోని పలు శాఖలకు సొంత భవనాలు లేకపోవడంతో పరాయి పంచన కొనసాగుతున్నాయి. కనీస సదుపాయాలు లేక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.

సొంతగూడు లేని కార్యాలయాలెన్నో?
స్కూల్‌ కాంప్లెక్స్‌ భవనంలో కొనసాగుతున్న ఎంఈవో, ఏటీడబ్ల్యూవో కార్యాలయాలు

పరాయి పంచన ఎంఈవో, ఏటీడబ్ల్యూవో, తహశీల్దార్‌ కార్యాలయాలు

రైతు సేవా కేంద్రం, గ్రంథాలయం కూడా..

సొంత భవన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోవడంతో తప్పని అవస్థలు

అనంతగిరి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు శాఖలకు సొంత భవనాలు లేకపోవడంతో పరాయి పంచన కొనసాగుతున్నాయి. కనీస సదుపాయాలు లేక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏటీడబ్ల్యూవో, ఎంఈవో, తహశీల్దార్‌ కార్యాలయాల సొంత భవన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

మండలంలోని ఏటీడబ్ల్యూవో, ఎంఈవో కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని రెండు గదుల్లో వీటిని నిర్వహిస్తున్నారు. అయితే మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకులం, తదితర సుమారు 176పైగా పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, క్రీడా సామగ్రిని భద్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే వార్డెన్లు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించేందుకు గది చాలకపోవడంతో బయట నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటీడబ్ల్యూవో కార్యాలయానికి 2019-20లో రూ.18 లక్షలతో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే పిల్లర్ల దశకు వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయి. కాగా 2018లో రూ.90 లక్షలతో తహశీల్దార్‌ కార్యాలయానికి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ప్లింత్‌బీమ్‌ దశకు వచ్చిన తరువాత పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. 24 పంచాయతీలకు చెందిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న భవనంలోనే తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌, ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, సర్వేయర్‌ తదితరులు విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భూ రికార్డులను భద్రపరిచేందుకు గదులు చాలకపోవడం సమస్యగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో రూ.23 లక్షలతో రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పిల్లర్ల దశకు వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం తూనికల కేంద్రంలో రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. రైతులకు పంపిణీ చేసే విత్తనాలు, ఎరువులను భద్రపరిచేందుకు సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే గ్రంథాలయానికి సొంత భవనం లేకపోవడంతో మండల పరిషత్‌ క్వార్టర్‌లోని ఒక గదిలో ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ గది పైకప్పు రేకులు ధ్వంసం కావడంతో వర్షం వచ్చినప్పుడు పుస్తకాలు తడిసిపోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, విద్యార్థులు కూర్చొని చదువుకునే అవకాశం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేయాలని, గ్రంథాలయానికి సరైన వసతి కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:27 AM