Share News

ఈ ఇక్కట్లు ఇంకెన్నాళ్లు

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:33 AM

అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ ప్రయాణికులకు సేవలు అందించడంలేదు. సుమారు ఆరు నెలల క్రితం ఇది మొరాయించగా... రైల్వే అధికారులు ఇంతవరకు బాగుచేయించలేదు. దీంతో రెండు, మూడు ప్లాట్‌ ఫారాలకు వెళ్లే ప్రయాణికులు లగేజీతో మెట్ల మీదుగా ఎక్కలేక ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలతో వున్న మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం.

ఈ ఇక్కట్లు ఇంకెన్నాళ్లు
రెండు, మూడు ప్లాట్‌ఫారాలకు వెళ్లేందుకు లగేజీతో మెట్లు ఎక్కుతున్న ప్రయాణికులు

అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో పనిచేయని ఎస్కలేటర్‌

ఆరు నెలల నుంచి పట్టించుకోని అధికారులు

మెట్ల మీదుగా రెండు, మూడు ప్లాట్‌ఫారాలకు వెళ్లేందుకు ప్రయాణికుల అగచాట్లు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ ప్రయాణికులకు సేవలు అందించడంలేదు. సుమారు ఆరు నెలల క్రితం ఇది మొరాయించగా... రైల్వే అధికారులు ఇంతవరకు బాగుచేయించలేదు. దీంతో రెండు, మూడు ప్లాట్‌ ఫారాలకు వెళ్లే ప్రయాణికులు లగేజీతో మెట్ల మీదుగా ఎక్కలేక ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలతో వున్న మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం. అనకాపల్లి స్టేషన్‌ నుంచి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి నియోజకవర్గాలతోపాటు పాడేరు ప్రాంత ప్రజలు రాష్ట్రంలో, దేశంలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దూరప్రాంతాలకు ప్రయాణించే వారికి లగేజీ అధికంగా వుంటుంది. రెండు, మూడు ప్లాట్‌ఫారాల్లో ఆగి రైళ్లలో ప్రయాణించేవారు మెట్ల మీదుగా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నిర్మించిన ఎస్కలేటర్‌ సుమారు ఆరు నెలల నుంచి పనిచేయడంలేదు. అధికారులు దీనిని బాగు చేయించి వినియోగంలోకి తీసుకురాకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమృత భారత్‌ పథకం కింద రైల్వేస్టేషన్‌లో రూ.27 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ పనిచేయని ఎస్కలేటర్‌ గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై స్టేషన్‌ మేనేజర్‌ సచ్చినివాస్‌ను వివరణ కోరగా.. ఎస్కలేటర్‌ మరమ్మతుకు గురైన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, ఇంజనీరింగ్‌ అధికారులు వచ్చి పరిశీలించారన్నారు. ప్రస్తుతం వున్న ఎస్కలేటర్‌ పూర్తిగా పాడైనందున కొత్త ఎస్కలేటర్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

Updated Date - Apr 22 , 2026 | 12:33 AM