గుర్తింపు లేని కాలేజీలెన్నో?
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:08 AM
జిల్లాలో గుర్తింపు లేని ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న కళాశాలలు చాలానే ఉన్నాయి.
ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహిస్తూ అడ్మిషన్లు కల్పిస్తున్న వైనం
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ప్రైవేటు యాజమాన్యాలు
రంగంలోకి ఆ సంస్థల పీఆర్‌వోలు, ఏజెంట్లు
ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామంటున్న విద్యాశాఖాధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గుర్తింపు లేని ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న కళాశాలలు చాలానే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో పాటు ఆ కళాశాలల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తమ సంస్థలో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికి చేర్చుకుంటున్నారు. అవి బోగస్ కళాశాలలు అని తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోతున్నారు.
జిల్లాలో అధికారుల గణాంకాల ప్రకారం 75కి పైగా జూనియర్ కాలేజీలు, 35 వరకు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఉన్నాయి. వీటితో పాటు మరో 18 వరకు ఫార్మా, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రెట్టింపు సంఖ్యలో కాలేజీలు నడుస్తున్నాయి. అనుమతుల కోసం కేవలం దరఖాస్తు చేసుకొని, అనుమతులు రాకుండానే విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఒక ప్రాంతంలో కాలేజీ క్యాంపస్ ఉండగా రెండు, మూడు చోట్ల భవనాలను అద్దెకు తీసుకొని ఒకే పేరుతో కాలేజీలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల అనుమతులున్నాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి మోసగిస్తున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో ఇటువంటి నర్సింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి.
గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు
ఎటువంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రైవేటు కాలేజీల నిర్వాహకులు విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో లేదా ఇతర ప్రాంతంలో ఏదో ఒక కాలేజీ తరఫున ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేలా చేస్తామని నమ్మబలుకుతున్నారు. నకిలీ గుర్తింపు పత్రాలు, విద్యాశాఖ, యూనివర్సిటీ అనుమతులున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి జూనియర్ కాలేజీ ఇంటర్ విద్యా బోధనకు ఏర్పాటు చేయాలంటే ముందుగా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు వంటి మౌలిక వసతులు ధ్రువీకరణతో పాటు అగ్నిమాపక ఏర్పాట్లు ఉన్నట్టు ధ్రువీకరణ, జీవీఎంసీ, మునిసిపాలిటీ, పంచాయతీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అదే విధంగా డిగ్రీ, పీజీ కోర్సుల కాలేజీల స్థాపనకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి అనుమతితో పాటు అఫిలియేషన్ కోసం సంబంధిత విశ్వవిద్యాలయం నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల నిర్వాహకులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలు పాటించాల్సి ఉంది. నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ కాలేజీలు ఏర్పాటు చేయాల్సి ఉంటే మెడికల్ కౌన్సిల్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల ధ్రువీకరణ తప్పనిసరి. కానీ జిల్లాలో ఎక్కడికక్కడ భారీ భవనాలు నిర్మించి, కొందరు అద్దెకు తీసుకొని పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసుకొని బోగస్ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కాలేజీల నిర్వాహకులైతే నకిలీ ఎఫిలియేషన్ లెటర్లను సిద్ధం చేసినట్టు సమాచారం. కె.కోటపాడు మండలంలో ఒక విద్యాసంస్థ యాజమాన్యం తమకు 25 ఏళ్ల అనుభవం ఉన్నట్టు ప్రచారం చేసుకొంటూ ఎటువంటి అనుమతులు పొందకుండానే డిఫెన్స్ అకాడమీని స్థాపించింది. ఇంటర్, డిగ్రీ విద్యతో పాటు డిఫెన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సదరు సంస్థ యాజమాన్యం గ్రామీణ యువతను ఆకర్షిస్తోంది. ఇటువంటి అనుమతి లేని విద్యా సంస్థలు అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల పరిధిలో మరికొన్ని నిర్వహిస్తున్నా పట్టించుకొనేవారే కరువయ్యారు.
నర్సింగ్ కాలేజీలదీ అదే దారి..
అనకాపల్లి, నర్సీపట్నం, అచ్యుతాపురం, పరవాడ, చోడవరం మండలాల పరిధిలో పలు నర్సింగ్ కాలేజీలు నడుస్తున్నా అవి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారుల నుంచి అనుమతులు పొందలేదని సమాచారం. 2023లో అనకాపల్లి కేంద్రంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలో నడుస్తున్న ఒక నర్సింగ్ కాలేజీ యాజమాన్యం నకిలీ విద్యార్థుల పేరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బును దొడ్డిదారిన ప్రభుత్వం నుంచి డ్రాచేసిన వైనం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆ కాలేజీ ప్రిన్స్‌పాల్‌పై పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. మాకవరపాలెం, సబ్బవరం, అచ్యుతాపురం కేంద్రాలుగా ఫార్మా కోర్సులు ఆఫర్ చేస్తూ పలు బోగస్ నర్సింగ్ కాలేజీలు వెలశాయి. అనకాపల్లి పట్టణ పరిధిలో కేవలం నాలుగు నర్సింగ్ కాలేజీలకు మాత్రమే పూర్తిస్థాయి అనుమతులు ఉండగా, మరో 8 వరకు ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. అపార్టుమెంట్లలో ఏర్పాటు చేస్తున్న కాలేజీల్లో ఎటువంటి ఫ్యాకల్టీ, వసతులు లేకపోయినా విద్యార్థుల అడ్మిషన్లు మాత్రం జరుగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, ఏజెంట్లను ఇప్పటికే రంగంలోకి దించాయి. వీరు గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సంప్రతించి అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా బోగస్ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు కల్పిస్తూ వారిని మోసం చేస్తున్నాయి.
అనుమతి లేకుండా అడ్మిషన్లు కల్పిస్తే చర్యలు
జిల్లాలో గుర్తింపు లేని కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న వైనంపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మద్దిలి వినోద్‌బాబును వివరణ కోరగా అనుమతులు పొందకుండా కాలేజీలు నిర్వహించినా, అడ్మిషన్లు కల్పించినా సహించబోమన్నారు. తప్పుడు పత్రాలతో బోగస్ కాలేజీలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు అందితే తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో అనుమతి పొందిన కాలేజీల్లో కూడా అన్ని మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? అనేదానిపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రమాణాలు పాటించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.