ఎన్నాళ్లీ కష్టాలు?
ABN , Publish Date - Sep 20 , 2026 | 01:03 AM
పేరుకే అది కాలనీ.. అంతర్గత రహదారులు లేవు. డ్రైనేజీ వ్యవస్థ లేదు. వర్షమొస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. ఇదీ పరవాడ తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ దుస్థితి.
- జగనన్న కాలనీలో కనీస వసతులు కరువు
- నాలుగేళ్లుగా కాలనీవాసుల అవస్థలు
- పట్టించుకోని అధికారులు
పరవాడ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పేరుకే అది కాలనీ.. అంతర్గత రహదారులు లేవు. డ్రైనేజీ వ్యవస్థ లేదు. వర్షమొస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. ఇదీ పరవాడ తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ దుస్థితి.
మండల కేంద్రం పరవాడ తహశీల్దార్ కార్యాలయానికి ఎదురుగా నాలుగేళ్ల క్రితం జగనన్న కాలనీ ఏర్పాటైంది. సుమారు 60 కుటుంబాలు అక్కడ నివాసముంటున్నాయి. వసతులను సమకూర్చడంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీని కారణంగా కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. వాడుక నీరు ఇళ్ల మధ్యలో నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీని వల్ల కాలనీ వాసులకు రాత్రి వేళ కంటి మీద కునుకు ఉండడం లేదు. పైగా దోమల కారణంగా జ్వరాల బారిన పడుతున్నారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి కాలనీలో వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.