Share News

కౌలు రైతులకు ఎన్నాళ్లీ కష్టాలు?

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:53 AM

కౌలు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. సీసీఆర్‌సీ కార్డులు అందక ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. సొంత భూమి లేకపోయినా వేలాది మంది రైతులు కౌలుకు భూములు తీసుకొని వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 5.18 లక్షల మంది సాగుదారులున్నారు. వీరిలో 3.25 లక్షల మంది వరకు మాత్రమే సొంత భూమి ఉన్నవారు కాగా, మిగిలినవారంతా కౌలు రైతులే. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం వల్ల పంట పెట్టుబడి సాయం, రుణాలు, బీమా, ప్రకృతి విపత్తుల పరిహారం వంటి ప్రభుత్వ ప్రయోజనాలు చాలా మందికి అందడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా కౌలు రైతులు ఆశలు పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

కౌలు రైతులకు ఎన్నాళ్లీ కష్టాలు?
బుచ్చెయ్యపేట మండలం గొర్రెలపాలెంలో గడ్డినారుకు నీరు పెడుతున్న రైతు

- సీసీఆర్‌సీ కార్డులు అందక ఇబ్బందులు

- ప్రభుత్వ ప్రయోజనాలు దక్కక అవస్థలు

- బ్యాంకు రుణాలు రాకపోవడంతో పంట పెట్టుబడికి అప్పులు

- ప్రకృతి విపత్తుల వల్ల నష్టమొస్తే రోడ్డున పడుతున్న వైనం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

కౌలు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. సీసీఆర్‌సీ కార్డులు అందక ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. సొంత భూమి లేకపోయినా వేలాది మంది రైతులు కౌలుకు భూములు తీసుకొని వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 5.18 లక్షల మంది సాగుదారులున్నారు. వీరిలో 3.25 లక్షల మంది వరకు మాత్రమే సొంత భూమి ఉన్నవారు కాగా, మిగిలినవారంతా కౌలు రైతులే. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం వల్ల పంట పెట్టుబడి సాయం, రుణాలు, బీమా, ప్రకృతి విపత్తుల పరిహారం వంటి ప్రభుత్వ ప్రయోజనాలు చాలా మందికి అందడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా కౌలు రైతులు ఆశలు పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

జిల్లాలో వరి, చెరకు, కూరగాయలు, పప్పుధాన్యాలు, వివిఽధ రకాల పంటల సాగును కౌలు రైతులు చేస్తుంటారు. ఎకరాకు రూ.15 వేలు నుంచి రూ.40 వేల వరకు కౌలు చెల్లించి సాగు చేస్తున్న రైతులు పెట్టుబడి వ్యయం పెరగడం, దిగుబడులు తగ్గడం, మార్కెట్‌ ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అందని సీసీఆర్‌సీ కార్డులు

భూ యజమానులతో సమానంగా కౌలుదారులకు కూడా పథకాల లబ్ధిని చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా సాగుహక్కు పత్రాలు (సీసీఆర్‌సీ కార్డులు) జారీ చేస్తుంటుంది. అన్నదాతల అవగాహనారాహిత్యంతో చాలామంది రైతులు వీటిని పొందలేకపోతున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తేనే పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాలు అందుతాయి. జిల్లాలో 60 నుంచి 75 వేల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు గత ఏడాది కేవలం 6 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకొని 5,373 మందికి మాత్రమే జారీ చేశాయి. వీరిలో 1,716 మంది కౌలు రైతులకు మాత్రమే రూ.7.92 కోట్లు రుణాలు మంజూరు చేసినట్టు వ్యవసాయాధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు రైతులు ఇప్పుడిప్పుడే సన్నద్ధమవుతున్న తరుణంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ వేగవంతం చేయాల్సి వున్నా, ఆ విధంగా చేయడం లేదు. మరో 6 వేల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటి వరకు 10 శాతం కార్డులు కూడా జారీ కాలేదు. నిబంధనల ప్రకారం సీసీఆర్‌సీ కార్డు కౌలు రైతులకు అందజేయాలంటే భూ యజమాని కౌలుకు ఇచ్చినట్టు సాగుహక్కు అంగీకార పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో భూ యజమాని ఎటువంటి సంతకం పెట్టకపోయినా గుర్తింపు కార్డు ఇచ్చేవారు. కొత్త నిబంధనల ప్రకారం సంతకంతో పాటు ఇతర వివరాలు భూ యజమాని ఇవ్వాల్సి ఉండడంతో తిరస్కరిస్తున్నారు. భూ యజమానులు అంగీకరించకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, సాంకేతిక చిక్కుల కారణంగా అనేక మంది కౌలు రైతులు నమోదు కాకుండానే మిగిలిపోతున్నారు.

బ్యాంకు రుణాలు అందక ఇబ్బందులు

బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎందుర్కొంటున్నారు. మరోవైపు గుర్తింపు కార్డులున్నా, రుణాల మంజూరులో ఆలస్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. విధి లేక అధిక వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకొని సాగు చేస్తున్నారు. పంట నష్టపోతే అప్పుల భారం మరింత పెరుగుతోంది. తుఫాన్లు, భారీ వర్షాలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టపోయిన అనేకమంది కౌలు రైతులకు పరిహారం అందడం లేదు. భూమి యజమానుల పేర్లే అధికారిక రికార్డుల్లో ఉండడంతో ఆరుగాలం చమటోడ్చి సాగు చేసిన కౌలు రైతులు మాత్రం ప్రభుత్వం అందించే సాయానికి దూరమవుతున్నారు. పంటల బీమా ప్రయోజనాలు కూడా పరిమితంగానే అందుతున్నాయి. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో కౌలు రైతులు రెండు విధాలా నష్టపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. కౌలు చెల్లింపులు, అప్పుల వడ్డీలు, కటుంబ ఖర్చులు భరించలేక కొందరు రైతులు సాగును వదిలేసి, పారిశ్రామిక వాడల్లో దినసరి కూలీలుగా వెళ్లిపోతున్నారు. కౌలు రైతులకు పూర్తి స్థాయి గుర్తింపు, సులభ రుణాలు, పెట్టుబడి సాయం, పంట బీమా, ప్రకృతి విపత్తుల పరిహారం అందిస్తామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు హామీలు గుప్పించడం పరిపాటిగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం వాటి అమలు విషయంలో జాప్యం చేస్తుండడంతో కౌలు రైతులు ప్రతి ఏడాది ఎదురు చూపులే మిగులుతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:53 AM