Share News

ఎన్నాళ్లీ అవస్థలు?

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:30 AM

జిల్లాలో జాతీయ రహదారి 516-ఈ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో జిల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చింతపల్లి మండలం లంబసింగి నుంచి పాడేరు వరకు 50 కిలోమీటర్ల రోడ్డు పనులు మందకొడిగా జరుగుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నాళ్లీ అవస్థలు?
జి.మాడుగుల మండలం వంజరి ఘాట్‌లో జరుగుతున్న పనులు

మందకొడిగా హైవే పనులు

లంబసింగి నుంచి పాడేరు వరకు నత్తనడక

ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి

వాహనదారులకు తప్పని కష్టాలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జాతీయ రహదారి 516-ఈ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో జిల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చింతపల్లి మండలం లంబసింగి నుంచి పాడేరు వరకు 50 కిలోమీటర్ల రోడ్డు పనులు మందకొడిగా జరుగుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే ఆ మార్గంలో వాహనదారుల అవస్థలు వర్ణణాతీతం.

రాజమహేంద్రవరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాకు అనుసంధానిస్తూ జాతీయ రహదారి(516-ఈ) నిర్మాణ పనులు గత నాలుగేళ్లుగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి చింతపల్లి మండలం లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మీదుగా విజయనగరం జిల్లా బొడ్డవర వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లా బొడ్డవర వరకు సుమారుగా 371 కిలోమీటర్ల జాతీయ రహదారిని రూ.1,575 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది.

లంబసింగి- పాడేరు రోడ్డు పనుల పరిస్థితి ఇదీ..

జిల్లాలో ప్రస్తుతం జాతీయ రహదారి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే ఏజెన్సీలో కొయ్యూరు, జీకే వీఽధి, చింతపల్లి మండలాల్లోని రోడ్డు పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి. అక్కడక్కడ చిన్నపాటి ప్యాచ్‌ వర్క్‌లు మినహా కాకరపాడు నుంచి చింతపల్లి(లంబసింగి) వరకు హైవే పూర్తయింది. అలాగే లంబసింగి నుంచి తాజంగి మీదుగా జి.మాడుగుల, అక్కడ నుంచి పాడేరు వరకు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనిలో కూడా అక్కడక్కడ రోడ్డు నిర్మాణం జరగ్గా, కొన్నిచోట్ల మట్టి పనులు, వంతెనల నిర్మాణం వంటివి కొనసాగుతున్నాయి. అయితే ఆయా రోడ్డు పనులు వేగంగా జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైవే పనులు జరుగుతుండడంతో గతంలో ఉన్న పాత రోడ్డును వెడల్పు చేయకుండా, ఇతర ఎటువంటి నిర్వహణ చేపట్టకుండా వదిలేశారు. దీంతో అరకొర పనులతో ఉన్న హైవేపైనే ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మట్టి, రాళ్ల పిక్కిలతో రోడ్డు ఉండడంతోపాటు చాలా చోట్ల కల్వర్టులు, వంతెనల పనులు జరుగుతుండడంతో రాకపోకలకు అంతగా అనువుగా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అవస్థలు పడుతూ పాడేరు నుంచి లంబసింగి మార్గంలో జనం రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు.

కలెక్టర్‌ పలుమార్లు ఆదేశించినా...

జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలని హైవే అథారిటీ అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్‌ టి.నిషాంతి పలుమార్లు ఆదేశించినప్పటికీ పనుల్లో వేగం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో జరగకపోవడంతో ప్రమాదాలు జరగడం, వర్షాలు కురిస్తే రోడ్డంతా బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగడం, పనులు మందకొడిగా జరుగుతుండడంతో ప్రయాణాలు ఆలస్యం కావడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే కలెక్టర్‌ నిషాంతి పలుమార్లు హైవే అథారిటీ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ పనుల్లో వేగం కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:30 AM