ఎన్నాళ్లీ డోలి మోతలు?
ABN , Publish Date - Aug 21 , 2026 | 10:30 PM
కొయ్యూరు మండలంలోని పొర్లుబంద గ్రామానికి చెందిన గర్భిణిని మూడు కిలోమీటర్లు కొండలు, వాగులు దాటి డోలీపై ఆస్పత్రికి తరలించారు. పురిటినొప్పులు వచ్చిన గర్భిణిని రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీపై తరలించేందుకు శుక్రవారం కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. తమకు ఎన్నాళ్లీ తిప్పలని వారు వాపోయారు.
డోలీలో గర్భిణి తరలింపు
తల్లీ,బిడ్డ క్షేమం
రోడ్డు సౌకర్యం లేక అవస్థలు
కొయ్యూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని మూలలపేట పంచాయతీ పొర్లుబంద గ్రామానికి చెందిన నందినికి గురువారం అర్ధరాత్రి దాటాక పురిటినొప్పులు వచ్చాయి. ఇది గుర్తించిన కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఆశ వర్కరు మర్రి గీతకు సమాచారమందించారు. దీంతో ఆమె ప్రసవించేందుకు అవసరమైన సపర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో గర్భిణిని పీహెచ్‌సీకి తరలించాలని సూచించింది. అయితే గ్రామం కొండశిఖరాన ఉండడం.. తగిన రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబీకులు గ్రామస్థుల సహకారంతో శుక్రవారం వేకువజామున గర్భిణిని డోలీపై మూడు కిలోమీటర్ల మేర కొండ దింపారు. అంతేకాకుండా మధ్యలో గల రెండు కొండవాగులు దాటిస్తూ కొండసంత గ్రామానికి చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న డౌనూరు పీహెచ్‌సీ అంబులెన్స్‌లో నందినిని పీహెచ్‌సీకి తరలించారు. నిర్దిష్ట కాల వ్యవధిలో పీహెచ్‌కి తరలించడంతో ఉదయం 7.30 గంటల సమయంలో నందిని ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ బరువు తగ్గి ఉండడంతో ప్రాథమిక వైద్య సేవలనంతరం మెరుగైన వైద్యానికి నర్సీపట్నం ఏరియా ఆ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్నారు. గ్రామస్థులు సకాలంలో స్పందించి డోలీలో నందినిని తరలించేందుకు చొరవ చూపడంతో రెండు ప్రాణాలకు ఏ విధమైన హాని లేకుండా బయటపడ్డామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవ చూపి పొర్లుబంద గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.