ఇలా ఉంటే ఎలా వెళ్లేది?
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:24 AM
అసలే అధ్వాన రహదారి.. దానికి తోడు ఇరువైపులా ఆక్రమించిన తుప్పలు. దీంతో రాకపోకలకు వాహనచోదకులకు తప్పని తిప్పలు.. ఇదీ మండలంలోని చింతలపూడి- చోద్యం రోడ్డు దుస్థితి. ఈ రహదారి నిర్మించి సుమారు 14 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో గోతులమయమై 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- అధ్వానంగా చింతలపూడి- చోద్యం రహదారి
- రాళ్లు తేలి రాకపోకలకు ఇబ్బందులు
- ఆపై ఇరువైపులా దట్టంగా తుప్పలు
- 40 గ్రామాల ప్రజలకు తప్పని అవస్థలు
- పట్టించుకోని అధికారులు
కొయ్యూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి):అసలే అధ్వాన రహదారి.. దానికి తోడు ఇరువైపులా ఆక్రమించిన తుప్పలు. దీంతో రాకపోకలకు వాహనచోదకులకు తప్పని తిప్పలు.. ఇదీ మండలంలోని చింతలపూడి- చోద్యం రోడ్డు దుస్థితి. ఈ రహదారి నిర్మించి సుమారు 14 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో గోతులమయమై 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని చింతలపూడి- చోద్యం రోడ్డులో ఐదు పంచాయతీలకు చెందిన సుమారు 40 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 14 ఏళ్ల క్రితం ఈ రోడ్డును నిర్మించినా ఇప్పటి వరకు కనీసం మరమ్మతులు చేయలేదు. దీంతో ఈ మార్గంలోని బొర్రంపేట నుంచి గింజర్తి మధ్యలో సుమారు 5 కిలోమీటర్ల మేర రహదారి కనీసం ద్విచక్ర వాహనంపై వెళ్లడానికి వీలులేనంతగా తయారైంది. రహదారి పొడవునా రాళ్లు తేలి ఉన్నాయి. ప్రధానంగా బొర్రంపేట నుంచి చింతలపూడి పంచాయతీ గింజర్తి వరకు సుమారు ఐదు కిలోమీటర్లు పొడవునా గోతులమయమైంది. దీనికి తోడు తుప్పలు దట్టంగా పెరిగి రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించాయి. దీంతో ఈ రహదారి కేవలం కాలిబాట మాదిరిగా మారింది. ఈ తుప్పలను తొలగించకపోవడంతో చిన్నపాటి మలుపులు వద్ద కూడా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయించడంతో పాటు తుప్పలను తొలగించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.