నాణ్యమైన విద్య అందేదెల?
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:48 AM
గిరిజన సంక్షేమశాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రభుత్వ, ఎంపీపీ, ఉన్నత పాఠశాలలు మాదిరిగా గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి అమలు కావడం లేదు.
- గిరిజన సంక్షేమశాఖ పాఠశాలల్లో అమలుకాని ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి
- విద్యార్థుల సంఖ్య పెరిగినా టీచర్ ఒక్కరే
- అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు కేటాయించని విద్యాశాఖ
చింతపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రభుత్వ, ఎంపీపీ, ఉన్నత పాఠశాలలు మాదిరిగా గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి అమలు కావడం లేదు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినా ఒక్కరే ఉపాధ్యాయుడు ఉంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు కేటాయించలేదు. దీంతో ఉపాధ్యాయులపై పనిభారం పెరిగిపోవడంతో పాటు సిలబస్‌ని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు.
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షణలో గిరిజన అభివృద్ధి ఏజెన్సీ(జీడీఏ) 1976-77లో వసతి గృహాలను ఏర్పాటు చేసింది. జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు వసతి గృహాల్లో ప్రవేశాలు కల్పించేవారు. గిరిజన విద్యార్థులు వసతి గృహాల్లో భోజన, వసతి పొందుతూ సమీపంలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసేవారు. 1979 నుంచి ఈ వసతి గృహాలు గిరిజన సంక్షేమశాఖ పరిధిలోకి వచ్చాయి. 1986లో గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు లేని శివారు గ్రామాల్లో గిరిజన విద్యా వికాస్ కేంద్రం(జీవీవీకే)లను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన జీకేవీవీకేల్లో ఏకోపాధ్యాయులు ఉండేవారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు విద్యాబోధన జరిగేది. కాలక్రమంగా జీకేవీవీలను గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)గా, వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్పు చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో ఒక్కొక్క పాఠ్యాంశానికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున పోస్టులు కేటాయించారు. గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో ఏకోపాధ్యాయుడు విద్యావిధానాన్ని కొనసాగిస్తున్నారు.
అమలుకాని విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నేటికి విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అమలు కావడంలేదు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి 20మంది విద్యార్థులు ఉండాలి. 40 మందికిపైగా విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. అలాగే గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 450కిపైగా ఉంటే ఒక్కొక్క పాఠ్యాంశానికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. గిరిజన సంక్షేమశాఖలో ఈ విధానం నేటికి అమలులోకి రాలేదు. చింతపల్లి మండలాన్ని పరిశీలిస్తే గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 80 ఉన్నాయి. ఇందులో 40మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 19 ఉన్నాయి. ఈ పాఠశాలల్లోనూ ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. మేడూరు జీపీఎస్ పాఠశాలలో 157 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. అయితే ఈ పాఠశాలలో కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. జోహార్ జీపీఎస్ పాఠశాలలో 82 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ కేవలం ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అలాగే చింతపల్లి మండలంలో గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో 450మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికి ఒక్కొక్క పాఠ్యాంశానికి ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. జిల్లాలోని 11 మండలాల్లోనూ గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. విద్యార్థుల సంఖ్య పెరిగినా అదనపు ఉపాధ్యాయుల పోస్టులను నియమించకపోవడం వల్ల ఉపాధ్యాయులపై పని భారం పెరిగిపోతున్నది. సకాలంలో సిలబస్‌ని పూర్తి చేయలేకపోతున్నారు. ఈ కారణంగా విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం లేదు.
మంజూరుకాని అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు
గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఒక్కటీ కేటాయించలేదు. గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి నేటికి అమలుకావడంలేదు. గిరిజన సంక్షేమశాఖ సీఆర్‌టీలను ఏర్పాటు చేసినప్పటికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో కేటాయింపులు జరగలేదు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సైతం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరు చేసి వుంటే ఉపాధ్యాయులకు పనిభారం తగ్గడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్య అందేది. ఇప్పటికైనా గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.