Share News

ఆటలు ఆడేదెలా?

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:42 AM

జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో శిబిరాలు మొదలుకానుండగా ఆయా క్రీడలకు సంబంధించిన పరికరాలు ఇంతవరకు జిల్లాకు చేరలేదు.

ఆటలు ఆడేదెలా?
గత ఏడాది అచ్యుతాపురంలో వేసవి క్రీడా శిబిరంలో ఖోఖో ఆడుతున్న క్రీడాకారులు

ఇంతవరకు జిల్లాకు చేరని క్రీడా పరికరాలు

మే ఒకటి నుంచి చిన్నారులకు శిక్షణ శిబిరాలు

ఎనిమిది నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు పలు ఆటల్లో తర్ఫీదు

మంజూరుకాని నిర్వహణనిధులు

గత ఏడాది పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని ఆందోళన

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో శిబిరాలు మొదలుకానుండగా ఆయా క్రీడలకు సంబంధించిన పరికరాలు ఇంతవరకు జిల్లాకు చేరలేదు.

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో పాఠశాల స్థాయి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, వివిధ క్రీడల్లో రాణిస్తున్న ఎనిమిది నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలను గుర్తించి వారిని మరింతగా ప్రోత్సహించడం ఈ శిబిరాల ఉద్దేశం. ఈ శిబిరాలు మొదలుకాకముందే ఆయా క్రీడలకు సంబంధించిన పరికరాలను ప్రభుత్వం సరఫరా జిల్లాలకు చేస్తుంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు వాటిని ఆయా మండలాలకు పంపుతుంటారు. కానీ గత ఏడాది శిబిరాలు ప్రారంభం అయ్యేనాటికి పరికరాలు రాలేదు. దీంతో క్రీడా శిబిరాలకు హాజరైన విద్యార్థులు సొంత సొమ్ముతో పరికరాలు కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. అయితే క్రీడా శిక్షణ శిబిరాలు ముగిసిన తరువాత పరికరాలు పంపిణీ కావడం ఈ సందర్భంగా గమనార్హం. కాగా ఈ ఏడాది మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం 50 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తిగల బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత ఏడాది మాదిరిగా కాకుండా ఈసారి క్రీడా పరికరాలను ముందుగా అందజేయాలని జిల్లా అధికారులు ఇప్పటికే శాప్‌కు ఇండెంట్‌ పెట్టారు. క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఇంకా రెండు వారాలు మాత్రమే గడువు వుండగా, ఇంతవరకు క్రీడా పరికరాలు రాలేదు.

వాస్తవానికి వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు క్రీడా సామగ్రి, శిక్షకుడి గౌరవ వేతనం, మైదానం నిర్వహణ ఖర్చులకు అవసరమైన నిధులను శాప్‌ ముందుగానే విడుదల చేయాలి. గతంలో ఒక్కో శిబిరానికి రూ.10 వేలు అందజేశారు. కానీ ఈసారి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లా ప్రాధికార సంస్థకు ఇంకా నిధులు విడుదల కాలేదని తెలిసింది. దీంతో ఇసారి కూడా సొంత సొమ్ముతో పరికరాలు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందేమోనని క్రీడాకారులు అంటున్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు నిధులు విడుదల కాకపోవడం, క్రీడా పరికరాలు ఇంతవరకు జిల్లాకు రాకపోవడంపై డీఎస్‌డీఓ పూజారి శైలజను వివరణ కోరగా.. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్రీడా పరికరాలు, నిధులను శిబిరాల ప్రారంభానికి ముందే అందజేయాలని అధికారులను కోరామన్నారు. క్రీడా పరికరాలు రాగానే శిబిరాలకు సరఫరా చేస్తామని ఆమె చెప్పారు.

Updated Date - Apr 15 , 2026 | 12:43 AM