హౌసింగ్ అధికారులకు షాక్
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:15 AM
పేదల ఇళ్ల నిర్మాణంలో ‘రాక్‌ట్రీ’ ఏజెన్సీస్ అనేక ఉల్లంఘనలకు పాల్పడినా ఏమీ పట్టనట్టు వ్యవహరించిన ఎనిమిది మంది హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు.
‘రాక్‌ట్రీ’ సంస్థకు అదనంగా బిల్లులు మంజూరు వ్యవహారంలో నోటీసులు
8 మందికి షోకాజ్
మరో 27 మంది సచివాలయ ఎమినిటీస్ కార్యదర్శులకు కూడా...
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):
పేదల ఇళ్ల నిర్మాణంలో ‘రాక్‌ట్రీ’ ఏజెన్సీస్ అనేక ఉల్లంఘనలకు పాల్పడినా ఏమీ పట్టనట్టు వ్యవహరించిన ఎనిమిది మంది హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. చేసిన పనుల కంటే ఎక్కువగా బిల్లులు మంజూరుచేసిన వ్యవహారంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో విఫలమైనందుకు 27 మంది సచివాలయ ఎమినిటీస్ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని గ్రామ/వార్డు సచివాలయాల విభాగానికి ఉన్నతాధికారులు సిఫారసు చేశారు.
నగర శివారులోని పైడివాడ అగ్రహారం, గంగవరం, నంగినారపాడు, నడుపూరు, గొల్లలపాలెం-2 లేఅవుట్‌లలో 14,021 ఇళ్ల నిర్మాణం చేపట్టిన ‘రాక్‌ట్రీ’ సంస్థ పలు అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. చేసిన పనులకు మించి బిల్లులు, మెటీరియల్ డ్రా చేసిన రాక్‌ట్రీ ఏజెన్సీ నుంచి రూ.22.77 కోట్లు రికవరీ చేయాలని సిఫారసు చేశారు. ఇదే సమయంలో బాధ్యతలు విస్మరించి రాక్‌ట్రీ ఏజెన్సీకి అనుకూలంగా వ్యహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదికలో సూచించింది. ఈ మేరకు అప్పట్లో జిల్లా హౌసింగ్ కార్యాలయంలో పనిచేసిన ఎనిమిది మంది అధికారులకు ఉన్నతాధికారులు షోకాజ్ ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో ఇక్కడ ఈఈగా పనిచేసిన జి.సత్యనారాయణ, డీఈలు ఆర్.ప్రసంగరాజు (ప్రస్తుతం రిటైరయ్యారు), బీఆర్వీ ప్రసాదరావు, వి.రామకృష్ణ, ఏఈలు కేవీ సూర్యారావు, జి.గోపాలకృష్ణ, ఎంఎం నాయుడు, ఎం.దీపక్ ఉన్నారు. అధికారులు చేసిన పనుల మేరకు మాత్రమే బిల్లులకు సిఫారసు చేయాలి. అలాగే ఇచ్చిన మెటీరియల్ మేరకు పనులు జరిగాయా?, లేదా?...అన్నది పరిశీలించాలి. కానీ, అటువంటిదేమీ లేకుండా బిల్లులు మంజూరుకు సిఫారసు చేశారని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తప్పుబట్టింది. ఇదిలావుండగా ఐదుచోట్ల క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షణ, మెటీరియల్ సరఫరా, వాటి వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, లబ్ధిదారులకు జియోట్యాగింగ్ చేయాల్సిన సచివాలయ వార్డు ఎమినిటీస్ కార్యదర్శులు 27 మంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ బృందం ప్రభుత్వానికి సిఫారసు చేసింది.