Share News

హౌసింగ్‌ బిల్లులకు మోక్షం

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:10 AM

గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు ఐదు నెలల తరువాత ఒక విడత బిల్లులు విడుదలయ్యాయి.

హౌసింగ్‌ బిల్లులకు మోక్షం

తొలివిడత రూ.15 కోట్లు విడుదల

రెండు రోజుల్లో మరో రూ.20 కోట్లు జమ

పనుల వేగం పెంచండి: హౌసింగ్‌ పీడీ

విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు ఐదు నెలల తరువాత ఒక విడత బిల్లులు విడుదలయ్యాయి. అధికారిక సమాచారం మేరకు తొలివిడత రూ.15 కోట్లు విడుదల చేయగా, మరో రూ.20 కోట్లు ఈనెల 12 లేదా 13న మంజూరుచేస్తారని చెబుతున్నారు.

జిల్లాలోని 65 లేఅవుట్‌లలో కాంట్రాక్టర్లు 80 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. కొందరు సొంతంగా నిర్మించుకుంటున్నారు. మరికొన్నిచోట్ల లబ్ధిదారుల సొంత స్థలాల్లో వారే నిర్మాణాలు చేపట్టారు. ప్రధానంగా ఆప్షన్‌-3 కింద లబ్ధిదారుల తరపున కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్లకు గత ఏడాది జూలై తరువాత బిల్లులు నిలిచిపోయాయి. అప్పటికే ఆయా లేఅవుట్‌లలో ఉన్న మెటీరియల్‌ మేరకు పనులు చేశారు. వర్షాలు ప్రారంభం కావడంతో చాలాచోట్ల నిలిపివేశారు. ఇక గత ఏడాది నవంబరు నుంచి పూర్తిగా పనులు నిలిచిపోయాయి. అయితే పలు కారణాలతో బిల్లుల మంజూరుకు ఇబ్బందులు ఎదురవడంతో కూలీలు వెనక్కి వెళ్లిపోయారు. మెటీరియల్‌లో ముఖ్యమైన సిమెంట్‌, ఇనుము సరఫరా నిలిచిపోయింది. ఈ ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టు గడువు ముగియనున్నందున నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులు ఒత్తిడి తెచ్చినా సొమ్ములు అందకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి పది రోజుల క్రితం హౌసింగ్‌ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో రెండు రోజుల క్రితం జిల్లాలోని సుమారు రూ.35 కోట్ల బకాయిలకు తొలివిడత రూ.15 కోట్లు విడుదలచేశారు. మరో రూ.20 కోట్లు త్వరలో విడుదలవుత్యాని అధికారులు చెబుతున్నారు. బిల్లులు మంజూరైన నేపథ్యంలో పనులు ప్రారంభించాలని జిల్లా హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సీహెచ్‌ సత్తిబాబు సూచించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 65 లేఅవుట్‌లలో 80వేల ఇళ్లకు గాను ఇప్పటివరకు 34 వేలు పూర్తవగా, మరో 25 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాక్రీట్‌ సంస్థ గతంలో 11 వేల ఇళ్లు చేపట్టింది. ఈ సంస్థను తప్పించడంతో కోర్టులో కేసు ఉంది. మిగిలిన వాటిలో కొన్ని కోర్టు కేసులు, ఇతర కారణాలతో పనులు ప్రారంభించలేదు. సొంత స్థలాలు, గ్రామాల్లో లేఅవుట్‌లలో మంజూరుచేసిన ఇళ్లల్లో 20 వేల ఇళ్లు పూర్తిచేశారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో నిర్మాణాలు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు హౌసింగ్‌ పీడీ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, రోజువారీ ప్రగతి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. సిమెంట్‌ సరఫరాకు వారం క్రితమే ఇండెంట్‌ పెట్టామన్నారు. అన్ని లేఅవుట్‌లలో ఇసుక ఉందని, అవసరమైన మేరకు సరఫరా చేస్తామన్నారు.


నేడు మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమావేశం

వర్చుల్‌గా హాజరుకానున్న కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం అమరావతిలో సమావేశం కానున్నారు. సచివాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే సమావేశానికి విశాఖ కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ వర్చువల్‌గా పాల్గొంటారు. జీఎస్‌డీపీ, 2047 విజన్‌లోని పది సూత్రాలపై సంబంధిత అధికారులు ప్రజంటేషన్‌ ఇస్తారు. ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఫైళ్ల పరిష్కారం, ఆన్‌లైన్‌ సేవలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ తదితర అంశాలపై సీఎం సమీక్షిస్తారు.

కాగా పథకాల అమలు, రాష్ట్రస్థాయిలో వెనుకబడి ఉంటే కారణాలపై కలెక్టర్‌ నివేదించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశాలపై సీఎం కలెక్టర్‌ అభిప్రాయం తెలుసుకునే వీలుంది. విశాఖలో అనేక ప్రాజెక్టులు అమలుచేస్తున్నందున వాటి అనుమతులు, పురోగతి, ఆదాయం సమకూర్చడంపై చర్చించనున్నారు.


అప్పన్న దర్శన వేళల్లో మార్పులు

సింహాచలం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి సందర్భంగా సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనవేళ్లల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు ఈఓ సుజాత ప్రకటించారు. ఈనెల 14న భోగి రోజున ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు నీలాద్రిగుమ్మం వరకు లఘుదర్శనాలు లభిస్తాయని, అంతరాలయ దర్శనాలు రద్దుచేశామన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు పవళింపు సేవ నేపథ్యంలో దర్శనాలు ఉండవు. 16న కనుమ పండుగనాటి గజేంద్ర మోక్షోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారు కొండదిగువకు వేంచేయనుండడంతో ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు, ఈనెల 18న నౌకావిహారోత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకు, 19న రాత్రి 7గంటల వరకు స్వామి దర్శనం లభిస్తుంది. ఆర్జిత సేవలన్నింటినీ ఈనెల 19వరకు రద్దుచేశామని ఈవో తెలిపారు.

Updated Date - Jan 12 , 2026 | 01:10 AM