26,426 మందికి ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:04 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 19వ తేదీన నగరానికి రానున్నారు.
19న సీఎం చేతుల మీదుగా పంపిణీ
బీచ్‌రోడ్డులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం
‘నిర్మల్ సాగర్’ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
ఏర్పాట్లపై ఎమ్మెల్యేలతో కలెక్టర్ సమావేశం
వర్చువల్‌గా పాల్గొన్న ఎంపీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 19వ తేదీన నగరానికి రానున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, అర్హులైన వారందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ముందుగానే ఆహ్వాన పత్రాలు అందజేయాలని, నిర్ణీత సమయానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పట్టాలు, కన్వేయన్స్ డీడ్స్ పంపిణీకి సంబంధించి మొత్తం 26,426 మందిని గుర్తించామన్నారు. భీమిలి నియోజకవర్గంలో 4,198 మంది, గాజువాకలో 5,597, పెందుర్తిలో 2,896, విశాఖ తూర్పులో 5,107, ఉత్తరంలో 2,425, దక్షిణంలో 1,228, పశ్చిమ నియోజకవర్గంలో 497 మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఆర్కే బీచ్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర
ఆర్కే బీచ్‌రోడ్డులో ఆరోజు ఉదయం జరగనున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్‌కాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘నిర్మల్ సాగర్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. బీచ్ క్లీనింగ్, సముద్ర వ్యర్థాల రీసైక్లింగ్, ఉపాధి కల్పన, తదితర కార్యాచరణ మార్గాలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, డీసీపీ మేరి ప్రశాంతి, డీఆర్‌వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రేటర్‌లో వార్డులు 120
గెజిట్ జారీచేసిన ప్రభుత్వం
22న కొత్త వార్డుల వారీగా వార్డు సచివాలయాలు, ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాల ప్రదర్శన
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీచేసినట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డులను పునర్విభజించి సరిహద్దులతో ఈ ఏడాది మే నెలలో ప్రాథమిక ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించామన్నారు. అనంతరం ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించగా, మరోసారి వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలంటూ ఈనెల మూడో తేదీన ఆదేశించిందన్నారు. దీంతో ఈనెల నాలుగు నుంచి 11 వరకు మరోసారి అభ్యంతరాలను స్వీకరించి, తుది ముసాయిదాను పంపించగా, పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేస్తూ సోమవారం గెజిట్ జారీచేసిందన్నారు. కొత్తగా విభజించిన 120 వార్డుల సరిహద్దులు, పరిధికి సంబంధించిన వివరాలు గెజిట్‌లో పొందుపరిచారన్నారు. నగరవాసులు తమ ప్రాంతం, నివాసం ఏ వార్డు పరిధిలో ఉందనేది తెలుసుకోవాలని కోరారు. ఒక్కో వార్డు పరిధిలోని ఓటర్లవివరాలను ఫొటోలతో సహా ఈనెల 22న వార్డు సచివాలయాలు, ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించారని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకునే బాధ్యతను జోనల్ కమిషనర్లకు అప్పగించినందున ఫొటో ఓటర్ల జాబితా తయారీలో వారంతా నిమగ్నమవుతారన్నారు. ఈనెల 22న ప్రచురించే ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని కమిషనర్ కేతన్‌గార్గ్ నగరవాసులను కోరారు