హోటల్ ఫుడ్ వెరీ బ్యాడ్
ABN , Publish Date - May 15 , 2026 | 01:31 AM
ఎంవీపీ కాలనీకి చెందిన రాజేంద్ర సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రెండు రోజుల కిందట జగదాంబ సెంటర్ సమీపాన గల ఒక రెస్టారెంట్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. మరుసటిరోజు నుంచి అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. వైద్యుడి వద్దకు వెళితే కలుషిత ఆహారం తినడం వల్లే సమస్య ఉత్పన్నమైనట్టు చెప్పి మందులు ఇచ్చారు.
నిల్వ ఆహారం...నిలువునా మోసం
ఇదీ నగరంలోని పలు హోటళ్లు/రెస్టారెంట్ల తీరు
మాంసాహార పదార్థాలు రోజుల తరబడి నిల్వ
వినియోగదారులకు వేడి చేసి వడ్డింపు
ఆహార భద్రత, ప్రమాణాల శాఖ
అధికారుల దాడుల్లో గుర్తింపు
ప్రమాదకర రసాయనాలు, రంగులు వినియోగం
అటువంటి ఆహారం తీసుకుంటే
స్వల్ప, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్న వైద్యులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):
ఎంవీపీ కాలనీకి చెందిన రాజేంద్ర సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రెండు రోజుల కిందట జగదాంబ సెంటర్ సమీపాన గల ఒక రెస్టారెంట్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. మరుసటిరోజు నుంచి అందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. వైద్యుడి వద్దకు వెళితే కలుషిత ఆహారం తినడం వల్లే సమస్య ఉత్పన్నమైనట్టు చెప్పి మందులు ఇచ్చారు.
ఇటీవల ఇసుకతోట జంక్షన్ సమీపంలో గల ఒక హోటల్‌లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు ఫ్రిజ్‌లో పాచిపోయిన చికెన్, గడ్డ కట్టి నిల్వ ఉన్న వండిన చేపల పులుసు, రొయ్యల కూరలను గుర్తించారు.
...వీటిని బట్టి నగరంలోని హోటళ్లు/ రెస్టా రెంట్లలో వండి వడ్డిస్తున్న ఆహార పదార్థాలు ఏపాటి నాణ్యంగా ఉంటున్నాయో అర్థం చేసు కోవచ్చు. గత కొన్నాళ్లుగా ఆహార భద్రత, ప్రమా ణాల శాఖ అధికారులు ఏ హోటల్, రెస్టారెంట్‌కు తనిఖీకి వెళ్లినా కిలోల కొద్దీ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు (చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో చేసినవే అధికం) కనిపిస్తున్నాయి. కేసులు నమోదుచేస్తున్నా నిర్వాహకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.
గడిచిన ఏడాది కాలంలో పదుల సంఖ్యలో హోటల్స్, రెస్టారెంట్లపై దాడి చేసిన ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు నిల్వ ఆహారానికి సంబంధించి 432 నమూనాలను సేకరించారు. జేసీ కోర్టులో 46, న్యాయస్థానాల్లో 56 కేసులు ఫైల్ చేశారు. జేసీ కోర్టులో ఫైల్ చేసిన 46 కేసుల్లో తొమ్మిది కేసులకు సంబంధించి తీర్పు రాగా, నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్న, గడువు తీరిన ముడి పదార్థాలు, నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఉన్నట్టు గుర్తించిన హోటల్స్, రెస్టారెంట్స్‌కు రూ.49 వేల వరకు జరిమానా విధించారు. మిగిలిన కేసులు తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
వీటిని గుర్తించాలి
హోటల్స్/రెస్టారెంట్స్‌కు వెళ్లేవాళ్లు వీలైనంత వరకు కిచెన్‌ను సందర్శించడం మంచిది. అందుకు అవకాశం ఇవ్వకపోతే ఆహారం దుర్వాసన వచ్చినా, అసహజమైన రుచి కలిగి వున్నా, ఎక్కువ నూనె, మసాలాలు వినియో గించినా, కర్రీ జిగటగా ఉన్నా అప్రమత్తం కావా లని, అటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా వండిన అన్నం బయట రెండు గంటల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఫ్రిజ్‌లో పెట్టినా 24 గంటల్లో వినియోగించాలి. చికెన్, మటన్, ఇతర కర్రీలు ఫ్రిజ్‌లో పెట్టినా ఒకటి, రెండు రోజులకు మించకూడదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే బాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. బిర్యానీ 24 గంటలు తరువాత రుచి మారడమే కాకుండా పాయిజనింగ్‌కు దారితీస్తుంది. వేపుడు పదార్థాలు పాత నూనెలో మళ్లీ వేడి చేస్తే గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. సాస్, చట్నీలు ఎక్కువ సేపు బయట ఉంచితే ఫంగస్, బాక్టీరియా పెరుగుతాయి.
నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ హెచ్చరిస్తున్నాం
- ఎస్.కల్యాణ చక్రవర్తి,
జిల్లా ఆహార భధత్ర, ప్రమాణాల శాఖ అధికారి
జిల్లాలోని హోటల్స్/రెస్టారెంట్స్‌లో ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనేక చోట్ల నిల్వ చేసిన ఆహార పదార్థాలు దొరకుతున్నాయి. అటువంటి హోటల్స్, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నిల్వ చేసిన ఆహార పదార్థాలు విక్రయించే హోటల్స్/రెస్టారెంట్స్‌కు వెళ్లకుండా ఉండాలి. ప్రజలకు అవగాహన కలిగించడంతోపాటు హోటల్స్/రెస్టారెంట్స్ యాజమాన్యాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్నాం.
తీవ్రమైన అనారోగ్య సమస్యలు
నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి వడ్డించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వేధించే అవకాశం ఉంది. అలాగే, ఆయా ఆహార పదార్థాల్లో వినియోగించే కొన్నిరకాల రసాయనాలు, రంగుల వల్ల దీర్ఘకాలంలో లివర్, కిడ్నీ సంబంధిత సమస్యలు, క్యాన్సర్, చిన్నారులు, వృద్ధుల్లో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.