Share News

హాట్‌ మెటల్‌ నేలపాలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:47 AM

స్టీల్‌ప్లాంటులో ‘పూల్డ్‌ ఐరన్‌’ పేరుతో విలువైన ఉక్కును నేలపాల్జేస్తున్నారు.

హాట్‌ మెటల్‌ నేలపాలు

పూల్డ్‌ ఐరన్‌తో ‘ఉక్కు’కు నష్టాలు

ఈ నెల 21వ తేదీ వరకూ 18,240 టన్నులు పారబోత!

విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో ‘పూల్డ్‌ ఐరన్‌’ పేరుతో విలువైన ఉక్కును నేలపాల్జేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి పరోక్షంగా నష్టాలు పెంచుతున్నారు. సగటున రోజుకు వేయి టన్నుల హాట్‌మెటల్‌ తుక్కుగా మారుతోంది. గత యాభై రోజుల నుంచి ఈ తంతు నడుస్తోంది.

రోజుకు 19 వేల టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించి ఆ ప్రకారం అన్ని విభాగాలను నడిపిస్తున్నారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా వచ్చే హాట్‌మెటల్‌ను స్టీల్‌గా మార్చడానికి ‘ఎస్‌ఎంఎస్‌’ విభాగానికి పంపిస్తారు. అక్కడ సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల పూర్తిస్థాయిలో హాట్‌ మెటల్‌ను స్టీల్‌గా మార్చలేకపోతున్నారు. అలా చేయలేని పక్షంలో ముందుగానే రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం కొంత హాట్‌ మెటల్‌ను అచ్చులుగా పోసి పిగ్‌ఐరన్‌గా మారుస్తారు. వాటిని సెకండరీ స్టీల్‌ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. అలాంటి ప్రణాళిక లేనప్పుడు హాట్‌ మెటల్‌ను నిల్వ చేసుకునే అవకాశం లేక నేలపై పారబోస్తారు. దానిని ‘పూల్డ్‌ ఐరన్‌’గా వ్యవహరిస్తారు. దీనిని తుక్కు కింద అతి తక్కువ ధరకు స్ర్కాప్‌ విక్రేతలకు అమ్మేస్తారు. ఎస్‌ఎంఎస్‌లో ప్రాసెస్‌ చేస్తే వచ్చే స్టీల్‌కు టన్నుకు రూ.50 వేలు వస్తుంది. అదే పూల్డ్‌ ఐరన్‌గా మారిస్తే రూ.5 వేలకు మించి రాదు. ఈ విధంగా ఈ జనవరిలో 21వ తేదీ వరకు 18,240 టన్నుల హాట్‌మెటల్‌ నేలపై పోసేశారు. బుధవారం ఒక్కరోజే 3,135 టన్నులు పారబోశారు. ఎస్‌ఎంఎస్‌ సామర్థ్యానికి తగినట్టుగా హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేసుకుంటే...ఇలా వృథాగా పారబోయాల్సిన పరిస్థితి రాదని ఉద్యోగ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే యాజమాన్యం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. పూల్డ్‌ ఐరన్‌ ఎక్కువ మోతాదులో ఉంటే ప్రశ్నించాల్సిన కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ దీనిపై మౌనంగా ఉండడం గమనార్హం. హాట్‌మెటల్‌ తయారీకి టన్నుకు రూ.40 వేల వరకు ఖర్చు అవుతుండగా, దానిని పూల్డ్‌ ఐరన్‌గా మార్చి తుక్కుగా రూ.5 వేలకు విక్రయించడం వల్ల టన్నుకు రూ.35 వేల నష్టం వస్తోందని, ఆ విధంగా నష్టాలు పెరిగిపోతున్నాయని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.


విశాఖ రైల్వేస్టేషన్‌లో నకిలీ కరెన్సీ స్వాధీనం

విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):

నకిలీ కరెన్సీతో ఇద్దరు శుక్రవారం రైల్వే పోలీసులకు చిక్కారు. ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సిబ్బంది స్థానిక రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కడప జిల్లా ప్రొద్దుటూరువాసి గండికోట గురుసునీల్‌ (22), ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వాగిచెర్ల నితీష్‌కుమార్‌ (23)లు రూ.200 ముఖ విలువ గల దొంగ నోట్ల (మొత్తం రూ.3.32 లక్షలు)లో పట్టుబడ్డారు. వారి నుంచి నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని రైల్వే పోలీసులు తెలిపారు.


విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):

వసంత పంచమి, గణతంత్ర దినోత్సవ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ-చర్లపల్లి మధ్య ఒక ట్రిప్పు (రానుపోను) ప్రత్యేక రైలు నడుపుతున్నామని సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. 08517 నంబరు గల రైలు ఈ నెల 25న సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుందని, తిరుగు ప్రయాణంలో 08518 నంబరు గల రైలు 26న మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుతుందన్నారు.


టీ20 టికెట్ల విక్రయాలకు మిశ్రమ స్పందన

విశాఖపట్నం-స్పోర్ట్స్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఈనెల 28న నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు శుక్రవారం సాయంత్రం 5.00 గంటలకు ఆన్‌లైన్‌ (డిస్ర్టిక్‌ బై జొమాటో)లో ప్రారంభమయ్యాయి. రూ.1,200, రూ.2,500, రూ.3,000, 4,000, రూ.4,500, రూ.5,000, రూ.10,000, రూ.12,000, రూ.15,000 ధర గల టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్ల కొనుగోలుకు మిశ్రమ స్పందన లభించింది. విక్రయాలు ప్రారంభమైన గంటల వ్యవధిలోనే రూ.1,200, రూ.2,500 టికెట్లు అమ్ముడైపోయాయి. రూ.3,000 టికెట్లు కాస్త నెమ్మదిగా అయ్యాయి. రాత్రి తొమ్మిది తర్వాత రూ.4000 టికెట్లు అమ్ముడైపోయాయి. మిగిలిన టికెట్లు రాత్రి 9.00 గంటల తర్వాత కూడా లభించాయి. గత నెల (డిసెంబరు) 6న భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌కు అన్ని ధరల టికెట్లు ఒక్కరోజులోనే హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయిన సంగతి తెలిసిందే. 28న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌లో కొహ్లి, రోహిత్‌ వంటివారు లేకపోవడంతో టికెట్ల అమ్మకాలకు ఆశించిన స్పందన రాలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 24 , 2026 | 12:47 AM