వేడెక్కిన ఎలమంచిలి
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:52 AM
ఎలమంచిలి మునిసిపల్ చైర్మన్ పదవిని జనరల్ మహిళలకు రిజర్వు చేయడంతో అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు బిజీగా వున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంతో కోడ్ అమల్లోకి వచ్చింది.
చైర్పర్సన్ అభ్యర్థిత్వంపై కూటమిలో ఊహాగానాలు
టీడీపీ నుంచి రేసులో కర్రి పావని, రాజాన లక్ష్మి, గొర్లె రత్నాజీ, ఆడారి వరలక్ష్మి
జనసేన నుంచి కర్రి ఝాన్సీ, బీజేపీ తరపున రమాకుమారి
పొత్తులో భాగంగా ఏ పార్టీకి కేటాయించినా.. ఐక్యంగా పనిచేయాలని నిర్ణయం
బొద్దపు తులసిని అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ
ఎలమంచిలి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపల్ చైర్మన్ పదవిని జనరల్ మహిళలకు రిజర్వు చేయడంతో అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు బిజీగా వున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ఏర్పాట్లను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. కాగా చైర్పర్సన్ పదవికి పోటీ చేసే అభ్యర్థి పేరును ముందుగా వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ తరపున బొద్దపు తులసీ పోటీ చేస్తారని వైసీపీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇక కూటమి నుంచి చైర్పర్సన్ పదవికి ఏ పార్టీ పోటీ చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పొత్తులో భాగంగా ఎలమంచిలిని టీడీపీకి కేటాయిస్తే... రేసులో కర్రి పావని, రాజాన లక్ష్మి, గొర్లె రత్నాజీ, ఆడారి వరలక్ష్మి వున్నారు. జనసేనకు కేటాయించినట్టయితే కర్రి ఝాన్సీ పేరు ఒక్కటే వినిపిస్తున్నది. ఈమెకు ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ ఆశీస్సులు వున్నాయి. ఇక బీజేపీ నుంచి తాను రేసులో వున్నట్టు మాజీ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎలమంచిలి మునిసిపల్ చైర్మన్ పదవిని ఏ పార్టీకి కేటాయిస్తారన్నదానిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిసింది. అయినప్పటికీ మూడు పార్టీలూ ఐక్యంగా వైసీపీపై ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి.