హాస్టళ్లకు సొంత భవనాలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:27 AM
రాష్ట్రంలోని వసతి గృహాలన్నింటికీ అధునాతన వసతులతో సొంత భవ నాలు నిర్మించనున్నామని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఆయన మంగళవారం దసపల్లా హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
నీట్, ఐఐటీ అకాడమీల్లో విద్యార్థులకు శిక్షణ
త్వరలో వార్డెన్లు, మ్యాట్రిన్లకు పదోన్నతులు
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులతో
పారదర్శక పాలన
మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
సిరిపురం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలోని వసతి గృహాలన్నింటికీ అధునాతన వసతులతో సొంత భవ నాలు నిర్మించనున్నామని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఆయన మంగళవారం దసపల్లా హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో మూడుచోట్ల నీట్, ఐఐటీ అకాడమీల్లో వసతి గృహ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వసతి గృహాల విద్యార్థులు ఈ ఏడాది ఐఐటీ, ఎన్‌ఐటీలో 150 సీట్లు సాధించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వసతిగృహాల్లో పనిచేసే వార్డెన్లు, మ్యాట్రిన్లకు ప్రమోషన్ల విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయన్నారు. అవాంతరాలను అధిగమించి త్వరలోనే అర్హులందరికీ ప్రమోషన్లు ఇస్తామన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు ద్వారా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఉన్నామని, ఇక్కడ పనిచేసే సిబ్బందికి అర్హతల మేరకు పదోన్నతులు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ దశల వారీగా కొనసాగుతుందన్నారు. మహిళా పోలీసులు ఎక్కువమంది ఐసీడీఎస్‌లో పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారని, దీనిపై ఎలా ముందుకువెళ్లాలో కసరత్తు చేస్తున్నామన్నారు. ఒకే భవనంలో రెండు, మూడు స్వర్ణ వార్డులు ఉన్నాయని, వాటిని సమీప ప్రభుత్వ కార్యాలయాల్లోకి తరలించనున్నామని, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని ఈ ప్రక్రియ చేపడతామన్నారు. ప్రజల వద్దకు సేవలను మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును వర్తింపజేశామన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, విధులు నిర్వహించే చోట నుంచే హాజరు నమోదు చేసుకోవచ్చన్నారు.