Share News

హాస్టల్‌ వార్డెన్‌ దాష్టీకం

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:52 AM

మెనూ ప్రకారం రోజూ కోడిగుడ్డు ఇవ్వడం లేదన్న విషయాన్ని హాస్టల్‌లో తనిఖీకి వచ్చిన ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి ఓ బాలుడు తీసుకెళ్లాడు.

హాస్టల్‌ వార్డెన్‌ దాష్టీకం

మెనూపై ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదుచేసిన విద్యార్థిపై కక్ష

కర్రతో తీవ్రంగా కొట్టడంతో గాయాలు

చేయి వాచిపోవడంతో గమనించిన తోటి విద్యార్థులు

ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడంతో వెలుగు చూసిన దారుణం

వార్డెన్‌పై విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు

అచ్యుతాపురం రూరల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి):

మెనూ ప్రకారం రోజూ కోడిగుడ్డు ఇవ్వడం లేదన్న విషయాన్ని హాస్టల్‌లో తనిఖీకి వచ్చిన ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి ఓ బాలుడు తీసుకెళ్లాడు. దీంతో ఆ విద్యార్థిపై వార్డెన్‌ కన్నెర్ర చేశాడు. తనపైనే ఫిర్యాదు చేస్తావా? అంటూ కర్రతో కొట్టాడు. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయులకు తెలియడంతో.. వారు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ ప్రతాపరెడ్డి ఈ నెల రెండో తేదీన అచ్యుతాపురం హైస్కూల్‌, సమీకృత వసతిగృహం, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. హాస్టల్‌ను తనిఖీ చేసిన సమయంలో 9, 10 తరగతుల విద్యార్థులతో మాట్లాడుతూ, వారానికి ఎన్ని కోడిగుడ్లు పెడుతున్నారని ప్రశ్నించారు. వారానికి రెండుసార్లు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారని 9వ తరగతి చదువుతున్న పి.రాముడు అనే విద్యార్థి చెప్పాడు. ఈ సమయంలో వార్డెన్‌ గిరిరాజు అక్కడే వున్నారు. అయితే అప్పుడు ఏమీ అనలేదు. మరుసటి రోజు ఉదయం వార్డెన్‌ కర్ర తీసుకుని, ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌కు తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ విద్యార్థి రాముడు చేతిపై తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మరిన్ని దెబ్బలు పడతాయని హెచ్చరించాడు. సోమవారం నాటికి రాముడు చేయి బాగా వాచిపోయి, నొప్పి అధికమైంది. పాఠశాలకు వెళ్లినప్పుడు తోటి విద్యార్థులు చూసి ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. వారు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. అంతేకాక వార్డెన్‌ దాష్టీకాన్ని విద్యా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా 9వ తరగతి విద్యార్థి రాముడును కర్రతో తీవ్రంగా ఎందుకు కొట్టారని వార్డెన్‌ గిరిరాజు ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. అతను హాస్టల్‌ గదిలో కబడ్డీ ఆడుతూ మరో విద్యార్థి గాయపడడానికి కారణం అయ్యాడని, దీంతో మందలించానే తప్ప కొట్టలేదని చెప్పారు.

ఇదిలా ఉండగా గత నెల 21వ తేదీన గౌరీశంకర్‌ అనే బాలుడుని, వార్డెన్‌ గిరిరాజు కొట్టడంతో అతని తల్లిదండ్రులు అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక హాస్టల్‌ నుంచి గౌరీశంకర్‌ను ఇంటికి తీసుకెళ్లిపోయారు.

Updated Date - Jan 06 , 2026 | 01:52 AM