‘రైతు ముంగిట్లో.. ఉద్యాన శాస్త్రవేత్తలు’ ప్రారంభం
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:36 PM
గిరిజన రైతుల వ్యవసాయ ప్రగతికి ఉద్యాన విశ్వవిద్యాలయం ‘ రైతు ముంగిట్లో.. ఉద్యాన శాస్త్రవేత్తలు’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి. రమణ అన్నారు.
గిరి రైతుల వ్యవసాయ ప్రగతికి ప్రత్యేక కార్యక్రమం
దుశ్చరపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఉద్యాన విశ్వవిద్యాలయం
గూడెంకొత్తవీధి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
గిరిజన రైతుల వ్యవసాయ ప్రగతికి ఉద్యాన విశ్వవిద్యాలయం ‘ రైతు ముంగిట్లో.. ఉద్యాన శాస్త్రవేత్తలు’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి. రమణ అన్నారు. శనివారం మండలంలోని దుశ్చరిపాలెం గ్రామంలో శాస్త్రవేత్తలు ‘రైతు ముంగిట్లో.. ఉద్యానశాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రమణ మాట్లాడుతూ దుశ్చరపాలెం గ్రామాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం దత్తత తీసుకున్నదన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న అల్లం, పసుపు, మిరియాలు, కాఫీ, చిలగడ దుంప, కూరగాయల సాగును ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ వ్యవసాయంలో రాణించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. నాట్లు వేసిన నాటి నుంచి వివిధ దశల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ కె.వెంకట సతీశ్, పి. రాజశేఖర్ పాల్గొన్నారు.