Share News

ఘోరం

ABN , Publish Date - Apr 26 , 2026 | 01:38 AM

భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బల సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతిచెందారు.

ఘోరం

బీచ్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం

ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి

డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం

భీమునిపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బల సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతిచెందారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గోపాలపట్నం కృష్ణనగర్‌ ప్రాంతానికి చెందిన గంగిరి కుషాల్‌కుమార్‌ (32) ఇక్కడి టెక్‌ మహీంద్ర కంపెనీలో టీమ్‌ మేనేజర్‌. మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన షేక్‌ తౌసీఫ్‌ (27) కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇరువురూ స్నేహితులు. శనివారం ఉదయం నగరం నుంచి కుషాల్‌కు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై భీమిలి బీచ్‌కు బయలుదేరారు. వీరి వాహనం ఐఎన్‌ఎస్‌ కళింగ మెయిన్‌గేటు దాటిన తర్వాత ఎర్రమట్టి దిబ్బల సమీపంలో వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఇరువురికీ తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయారు. సమాచారం అందడంతో బీచ్‌ పెట్రోలింగ్‌ పోలీసులు సంఘటనా స్థలికి వెళ్లి భీమిలి ఎస్‌ఐ జె.సురేష్‌కు ప్రమాద విషయాన్ని తెలిపారు. ఆయన ప్రమాద స్థలిని పరిశీలించి మృతదేహాలను భీమిలి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతులిద్దరి సెల్‌ఫోన్‌లు ప్రమాదంలో పాడవడంతో వారి వివరాలు తెలుసుకోవడం ఆలస్యమైంది. కుషాల్‌ కుమార్‌ తండ్రి గంగిరి సోమశేఖర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుషాల్‌కుమార్‌ తండ్రి సోమశేఖర్‌ విశాఖ పోర్టు ట్రస్ట్‌లో పనిచేసి రిటైరయ్యారు. కుమారుడి మరణంతో భోరున విలపిస్తున్నారు. షేక్‌ తౌసిఫ్‌ తండ్రి ఘౌస్‌ మొహిద్దీన్‌ కనిగిరిలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. తల్లి షేక్‌ మల్లిక. ఈ దంపతులకు ఇరువురు కుమారులు. పెద్దకుమారుడు తౌసిఫ్‌. చిన్నకుమారుడు పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.


బియ్యం కార్డుదారులకు రాగులు

గాజువాక/ఆరిలోవ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

బియ్యం కార్డుదారులకు మే నెలలో రాగులు అందజేయనున్నారు. ప్రతి కార్డుపై మూడు కిలోలు రాగులు ఇవ్వాలని డీలర్లకు పౌర సరఫరాల శాఖ సూచించింది. డిసెంబరు, జనవరి నెలల్లో రాగులు ఇచ్చిన పౌర సరఫరాల శాఖ ఫిబ్రవరిలో కొద్దిమందికి అందజేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సరఫరా నిలిపివేసింది. అయితే కార్డుదారుల నుంచి డిమాండ్‌ ఉండడంతో మే నెలలో తిరిగి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే డిపోలకు బియ్యం, పంచదార, గోధుమపిండితోపాటు రాగులు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమపిండి కొనుగోలుకు కార్డుదారులు అంతగా మొగ్గుచూపడం లేదు. అయితే కార్డుదారులకు నచ్చచెబుతూ అమ్మకాలు చేస్తున్నారు.


కొనసాగుతున్న డీజిల్‌ కొరత

అనేకచోట్ల ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అమ్మకాలు

రాత్రి షిఫ్ట్‌ రద్దు

నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి

త్వరలో రేట్లు పెంపు

ఆ తరువాత నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో డీజిల్‌ కొరత కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని బంక్‌ల యజమానులు చెబుతున్నారు. ఈ నెల 28తో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తరువాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు సరఫరా ఉద్దేశపూర్వకంగా తగ్గించారని భావిస్తున్నారు. కొత్త ధరలు వచ్చేంత వరకు వీలైనంత తక్కువ సరఫరా ఇస్తామని అన్యోపదేశంగా ఆయిల్‌ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బంకులను చాలాచోట్ల రాత్రి తొమ్మిది గంటల తరువాత మూసేస్తున్నారు. వారికి డీజిల్‌ సరఫరా బాగా తగ్గిపోయింది. బీపీసీఎల్‌ కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. రెగ్యులర్‌గా పెట్రోల్‌, డీజిల్‌ కలిపి ఐదు ట్యాంకర్లు వచ్చే బంకుకు శనివారం కేవలం రెండు ట్యాంకర్లు మాత్రమే పంపించారు. వాటిని కూడా రెండు రోజులు వాడుకోవాలని ఆదేశించారు. అంటే ఆదివారం రాత్రి వరకు తక్కువ తక్కువగా విక్రయించాలని సూచించారు. ఒకేసారి ఎక్కువ అమ్ముకుంటే ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టుకోవాలని చెబుతున్నారు.

రాత్రి షిఫ్ట్‌ రద్దు

బంకుల్లో ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. ఉదయం 6 నుంచి 2, 2 నుంచి రాత్రి 10 గంటలు, రాత్రి 10 నుంచి తెల్లవారు జాము 6 వరకు షిఫ్టులు ఉంటాయి. ఇప్పుడు డీజిల్‌ సరఫరా తగ్గిపోవడంతో అనేక బంకులు రాత్రి తొమ్మిది గంటలకు దుకాణం సర్దేస్తున్నాయి. మూడో షిఫ్ట్‌ రద్దు చేశాయి. మే ఒకటి నుంచి పెంచిన రేట్లు అమలులోకి వస్తాయని, అప్పుడు అడిగినన్ని ట్యాంకులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 01:38 AM