Share News

ఘోర ప్రమాదం

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:36 AM

చింతాలమ్మ ఘాట్‌ నాలుగవ మలుపు వద్ద బుధవారం ఉదయం లారీ అదుపుతప్పి కొండను ఢీకొనడంతో డ్రైవర్‌ మృతి చెందగా, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

 ఘోర ప్రమాదం
కొండను లారీ ఢీకొన్న దృశ్యం

అదుపుతప్పి కొండను ఢీకొన్న లారీ

డ్రైవర్‌ దుర్మరణం

క్లీనర్‌కు తీవ్ర గాయాలు

కొయ్యూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): చింతాలమ్మ ఘాట్‌ నాలుగవ మలుపు వద్ద బుధవారం ఉదయం లారీ అదుపుతప్పి కొండను ఢీకొనడంతో డ్రైవర్‌ మృతి చెందగా, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి నుంచి ఎరువుల లోడుతో విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన డ్రైవర్‌ సాలపు కృష్ణ(51), శ్రీకాకుళం జిల్లా రాజాం సమీప కొట్టవలస వాస్తవపురి కాలనీకి చెందిన క్లీనర్‌ షేక్‌ అసీర్‌(43) బుధవారం లారీలో అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు బయలుదేరారు. చింతాలమ్మ ఘాట్‌ నాలుగవ మలుపు వద్దకు వచ్చేసరికి లారీ బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న సీఐ శ్రీనివాసరావు వాహనాన్ని తప్పించబోయి లారీ అదుపుతప్పి డివైడర్‌ దాటి కొండను ఢీకొంది. సీఐ వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్‌ను అతికష్టమ్మీద బయటకు తీశారు. డ్రైవర్‌ కృష్ణను బయటకు తీయడానికి సాధ్యం కాకపోవడంతో ఎక్స్‌కవేటర్‌కు, అలాగే రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారికి సమాచారం ఇచ్చారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే అతను అప్పటికే మృతి చెందాడు. కాగా క్లీనర్‌కు పీహెచ్‌సీ వైద్యాధికారి నాయక్‌ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

సీఐ శ్రీనివాసరావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన మండలంలోని శరభన్నపాలెం, నడింపాలెం గ్రామాలను సందర్శించి వస్తుండగా చింతాలమ్మఘాట్‌లో లారీ వేగంగా రావడాన్ని గుర్తించి తన వాహనాన్ని చాకచక్యంగా పక్కకు తప్పించారు. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి అక్కడ నుంచి 20 అడుగుల దూరంలో కొండను ఢీకొంది. ఆయన వెంటనే స్పందించడంతో క్లీనర్‌కు ప్రాణాపాయం తప్పింది.

Updated Date - Aug 20 , 2026 | 12:36 AM