Share News

ఘోరం

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:37 AM

అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే ఘోర సంఘటనలో ముగ్గురి మృతికి, 9 మంది గాయపడడానికి కారణమయిందని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘోరం

  • ప్రాణం తీసిన అతివేగం

  • ప్రయాణికులు హెచ్చరించినా పట్టించుకోని డ్రైవర్‌

  • శ్రీనగర్‌ వద్ద లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

  • ముగ్గురి మృతి, 9 మందికి గాయాలు

  • కేజీహెచ్‌లో ఎనిమిది మందికి చికిత్స

  • మెడికవర్‌ ఆస్పత్రిలో మరో బాధితురాలు

  • కన్నీరు, మున్నీరైన బాధిత కుటుంబసభ్యులు

విశాఖపట్నం/మహరాణిపేట, మే 31 (ఆంధ్రజ్యోతి):

అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే ఘోర సంఘటనలో ముగ్గురి మృతికి, 9 మంది గాయపడడానికి కారణమయిందని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 35 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు గాజువాక శ్రీనగర్‌ జంక్షన్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్‌తో సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిదిమంది కేజీహెచ్‌లో, ఒకరు మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాద ఘటనపై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు వివరించి బావురుమన్నారు.

రాజమహేంద్రవరంలో బస్సు బయలుదేరింది, తునిలో డ్రైవర్‌ మారారు. అప్పటి నుంచి అతడి డ్రైవర్‌ వ్యవహారశైలితో ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో బస్సును నడపడంతో సీట్లలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రమాదానికి కొన్నిక్షణాల ముందు పెద్ద శబ్దం వచ్చిందని, ప్రాణాలు పోయాయనుకున్నానని ప్రయాణికురాలు ప్రశాంతి వెల్లడించారు. బస్సు అతివేగంతో ముందున్న లారీని ఢీకొట్టడంతో సీట్లలో నుంచి కొందరు ఎగిరిపడ్డారని, ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు మిన్నంటాయని క్షతగాత్రుడు రామకృష్ణ తెలిపారు.

కేజీహెచ్‌కు క్షతగాత్రులు

ఉదయం ఏడు గంటల సమయానికి క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వైద్యులు వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో బస్సు నడుపుతున్న డ్రైవర్‌ ఎస్‌.జమ్మయ్య (పార్వతీపురం)తో పాటు ప్రయాణికులు ఆకుల శివనాగేశ్వరరావు (రాజమహేంద్రవరం), నివ్య జీవిత (విజయనగరం), లంకా ఈశ్వరమ్మ (విజయనగరం), మావూరి శ్రీనివాస్‌ (రాజమహేంద్రవరం), కనకం రాజు (పార్వతీపురం), కె.రామకృష్ణ (జామి, విజయనగరం జిల్లా), ప్రశాంతి, చిన్నారులు ఆర్‌.తన్విహ (రాజమహేంద్రవరం), ఎం.నివేదిత (7) చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన కనకం లలిత (55)ను మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణ, అడ్మినిస్ర్టేటర్‌ రమణ తెలిపారు.

అమ్మ ఇంటికి పిల్లలను తీసుకెళ్తూ...

ప్రమాదంలో మృతిచెందిన ఆర్‌.రాధామాధవి రాజమహేంద్రవరం నుంచి విజయనగరంలోని అమ్మగారి ఇంటికి వెళు తోంది. బాబు కార్తికేయ, పాప తన్విహతో కలిసి శనివారం రాత్రి రాజమహేంద్రవరంలో బస్సు ఎక్కింది. భర్త ఆర్‌ఎన్‌వీ ప్రసాద్‌ వారిని బస్సు ఎక్కించాడు. మరో రెండు గంటల్లో విజయనగరం చేరుకునేలోగా ఆమెను మృత్యువు కబళించింది. ఇద్దరు పిల్లల్లో కార్తికేయ క్షేమంగా ఉండగా, తన్విహ తీవ్రంగా గాయపడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో అమ్మ గారింటికి వెళ్లి పదిరోజులు ఉందామని పిల్లలతో సహా బయలుదేరగా విషాద ఘటన జరిగింది. అద్దె ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న మాధవి భర్త ప్రసాద్‌ కేజీహెచ్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. భార్య మృతితో తన బిడ్డలకు దిక్కెవరంటూ అతడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పితిరిగి రానిలోకాలకు వెళ్లిపోయావా.? అంటూ భార్యను తరలచుకుని భోరున విలపించాడు.

పెన్షన్‌ కోసం వస్తూ

విజయనగరానికి చెందిన లెంక ఈశ్వరమ్మ ఇటీవల ఇద్దరు మనవళ్లతో సహా (ఒక కుమార్తె పిల్లలు) రాజమహేంద్రవరంలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లింది. జూన్‌ ఒకటో తేదీన పెన్షన్‌ ఇస్తారని చిన్న మనవరాలు నివేదితతో కలిసి శనివారం రాత్రి రాజమహేంద్రవరంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. కొద్దిగంటల్లో ఇంటికి చేరుతుందనగా ప్రమాదం ఆమెను మృత్యు ఒడికి చేర్చింది. అమ్మమ్మతోపాటు బస్సులో ఉన్న చిన్నారి నివేదిత గాయపడి కేజీహెచ్‌ ఈఎండీ విభాగంలో చికిత్స పొందుతోంది. ఈశ్వరమ్మ మృతితో ఆమె కుమార్తె సంతి రూపాదేవి, అల్లుడు మోహన్‌కుమార్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు ఎక్కే ముందే ఫోన్‌లో మాట్లాడానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని రూపాదేవి విలపించింది.

గొడవ పరిష్కరించేందుకు వెళ్తూ..

రాజమహేంద్రవరంలో వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఎం.శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కలిసి విజయనగరంలో ఓ గొడవను పరిష్కరించేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని, ఏం జరిగిందో తెలుసుకునేలోగా బస్సులో లైట్లు ఆగిపోయాయని తెలిపాడు.

బాధితులకు పరామర్శ

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉన్నారని, తునిలో డ్రైవర్‌ మారిన తరువాత వెనుకకూర్చున్న డ్రైవర్‌ ప్రమాదంలో మృతిచెందగా, బస్సు నడుపుతున్న మరో డ్రైవర్‌ గాయపడ్డాడని విశాఖ కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ వివరించారు.

వేగానికి హడలిపోయాం

బస్సు అమితవేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. అప్పటికే చెల్లాచెదురుగా పడిపోయాం. మూడో లైన్‌లో ఉన్న అమ్మ, నాన్న తీవ్రంగా గాయపడ్డారు. నేను నాలుగో లైన్‌లో ఉన్నాను. తలకు గాయమయింది. హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉన్న ఫోన్లు నుజునుజ్జయిపోయాయి. చనిపోయామనుకున్నాం. సంఘటన స్థలంలో ఎక్కువ మంది జనం ఉండడంతో వేగంగా సహాయక చర్యలు అందాయి.

- బి.ప్రశాంతి, క్షతగాత్రురాలు

Updated Date - Jun 01 , 2026 | 12:37 AM