ఘోరం
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:22 AM
రోడ్డు ప్రమాదాల్లో శుక్రవారం ఇద్దరు మృతిచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
మరో తొమ్మిది మందికి గాయాలు
బీఆర్‌టీఎస్ రోడ్డులో కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పరవాడ మండలంలో కల్వర్టులోకి దూసుకుపోయిన కారు
ఆరిలోవ/పరవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):
రోడ్డు ప్రమాదాల్లో శుక్రవారం ఇద్దరు మృతిచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 13వ వార్డు దారపాలెం వద్ద బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందారు. సీఐ మల్లేశ్వరరావు కథనం ప్రకారం...కాకినాడకు చెందిన రాజేశ్ (35) కుటుంబంతో సింహాచలం వచ్చారు. స్వామిని దర్శించుకుని, అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ఉదయం ఏడు గంటల సమయంలో బయలుదేరారు. వీరి వాహనం దారపాలెం బీఆర్టీఎస్ రోడ్డులోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న రాజేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పెద్దలు, ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాజేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు మార్చురీకి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
విశాఖ నగర పరిధిలోని వడ్లపూడి ఆర్‌హెచ్ కాలనీకి చెందిన ఈర్ల అనిల్‌కుమార్ (30), జీవీఎంసీ 77వ వార్డు పరిధి అప్పికొండ సమీపంలోని శ్రీరామనగర్‌కు చెందిన కూండ్రపు పవన్‌కుమార్, ఈర్ల సతీశ్, ధర్మిరెడ్డి మధు కలిసి గురువారం రాత్రి కారులో పరవాడ మండలం కలపాక, మరిశవానిపాలెంలో జరిగిన దుర్గాదేవి ఉత్సవాలకు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి బయలుదేరారు. సుమారు కిలోమీటరు దూరం వెళ్లేసరికి కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని, పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు కుడి వైపు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారు నడుపుతున్న ఈర్ల అనిల్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్‌కుమార్, సతీశ్, మధు గాయాలతో బయటపడ్డారు. కారును అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ఉత్సవానికి హాజరై తిరిగి వెళుతున్నవారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనిల్‌కుమార్ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిచెందిన అనిల్‌కుమార్ పెదగంట్యాడ సమీపంలోని మెడ్‌టెక్ జోన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 31వ తేదీన అప్పికొండ సమీపంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన యువతితో వివాహమైంది. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.