ఆశాజనకంగా రబీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:36 PM
ప్రస్తుత రబీ సీజన్ అపరాలు, గంటి, నువ్వులు, తదితర పంటలకు మంచి అనుకూలంగా ఉందని, వైఎల్‌ఎం146 వంటి నువ్వు విత్తనాలు వేసేందుకు అనువైన వాతావరణం ఉందని వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు తెలిపారు.
అపరాలు, గంటి, నువ్వుల పంటలకు అనుకూలం
జిల్లా వ్యవసాయ సమీక్ష సమావేశంలో ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు
అనకాపల్లి అగ్రికల్చర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రబీ సీజన్ అపరాలు, గంటి, నువ్వులు, తదితర పంటలకు మంచి అనుకూలంగా ఉందని, వైఎల్‌ఎం146 వంటి నువ్వు విత్తనాలు వేసేందుకు అనువైన వాతావరణం ఉందని వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శనివారం నిర్వహించిన జిల్లా వ్యవసాయ సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఖరీఫ్‌లో 7 శాతం అధిక వర్షపాతం వల్ల వరి విస్తీర్ణం 21 శాతం పెరిగిందని తెలిపారు. రైతులు వరిలో సగటున 30 నుంచి 35 బస్తాల దిగుబడి సాధించారని చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి మాట్లాడుతూ ఖరీఫ్‌లో చీడపీడల బెడద తగ్గినందున పురుగు మందుల వినియోగం కూడా తగ్గిందన్నారు. కొత్త వరి రకాలైన ఆర్‌జీఎల్ 7034, 7039, 7038, 7045 మంచి ఫలితాలనిచ్చాయని, వీటిలో 7034, 7045 మరింత ఆశాజనకంగా ఉన్నాయన్నారు. పశుగ్రాస పంటలకు మితిమీరి యూరియాను వేస్తున్నారని, ఇది తగదని, ఇలా వేయడం వలన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని సూచించారు. యూరియా వినియోగంపై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని కోరారు. చెరకు, వేరుశనగ, మొక్కజొన్న పంటల విస్తీర్ణం తగ్గుతోందని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, ప్రధాన శాస్త్రవేత్తలు టి.శ్రీలత, కె.వి.రమణమూర్తి, డి.ఆదిలక్ష్మి కుమారి, దాడి ఉమామహేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు.