Share News

షైనింగ్‌ స్టార్‌లకు సత్కారం

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:06 AM

కష్టపడి చదవడమే కాకుండా తెలివిగా ఆలోచించే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, అప్పుడే ఉన్నతంగా రాణించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

షైనింగ్‌ స్టార్‌లకు సత్కారం

  • టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభ కనబరచిన 134 మందికి అవార్డుల ప్రదానం

  • ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు, ప్రశంసాపత్రం

  • విద్యార్థులు కష్టపడి చదవడమే కాదు

  • తెలివిగా ఆలోచన చేయడం అలవర్చుకోవాలి: కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

  • మనతో పాటు జీవితాంతం ఉండేది చదువు ఒక్కటే: ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

  • విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే వెలగపూడి

సిరిపురం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):

కష్టపడి చదవడమే కాకుండా తెలివిగా ఆలోచించే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, అప్పుడే ఉన్నతంగా రాణించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. సోమవారం సిరిపురం జంక్షన్‌లోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌లో నిర్వహించిన ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాను కూడా పదో తరగతిలో టాపర్‌గా నిలిచానని, నాటి జిల్లా కలెక్టర్‌ రావత్‌ చేతులమీదుగా అవార్డును అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడి పనిచేస్తే విజయాలు సాధించవచ్చునని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, లీప్‌ (లెర్నింగ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఏపీ) కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులను గౌరవించి, వారి మార్గదర్శకత్వాన్ని జీవితంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ మనతో పాటు జీవితాంతం ఉండేది చదువు ఒక్కటేనన్నారు. పిల్లలను తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇది జీవితంలో మరిచిపోలేని రోజన్నారు. తాను కూడా చదువులో టాపర్‌నేనని, కానీ తనకు అవార్డు ఇవ్వలేదన్నారు. తన మార్కుల లిస్టు చూసి, వచ్చే ఏడాది తనకు కూడా కలెక్టర్‌ అవార్డు ఇవ్వాలని ఛలోక్తి విసిరారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణబాబు మాట్లాడుతూ గతంలో తాము లాంతరు వెలుగులో చదువుకునే పరిస్థితులు ఉండేవన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థులకు అనేక వసతులను కల్పిస్తుందన్నారు. వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మరింతగా రాణించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష ప్రాజెక్టు సమన్వయకర్త డా.జి.చంద్రశేఖర్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

134 మంది విద్యార్థులకు అవార్డులు

ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 134 మంది (88 మంది టెన్త్‌, 46 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు)కి షైనింగ్‌ అవార్డులను ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ ప్రదానం చేశారు. రూ.20 వేల చెక్కుతో పాటు ప్రశంసాపత్రం, స్వామి వివేకానంద జీవన చరిత్ర పుస్తకం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు లేకుండా..

ప్రభుత్వ కార్యక్రమాలు అంటే కచ్చితంగా ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి ఫొటోలు ఏర్పాటుచేయడం సర్వసాధారణం. అయితే ప్రభుత్వానికి పేరు రావాలి తప్ప వ్యక్తులకు కాదని ముఖ్యమంత్రి, విద్యా శాఖా మంత్రి చెప్పడంతో పాటు దానిని అమలు చేయడం అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. షైనింగ్‌ అవార్డులను కేవలం ప్రభుత్వ లోగోతో నిర్వహించడం విశేషం.

Updated Date - Jul 21 , 2026 | 01:06 AM