కుటీర పరిశ్రమగా తేనె ఉత్పత్తి
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:23 PM
ఆదివాసీ రైతులు తేనె ఉత్పత్తిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకోవాలని ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీటీసీ) రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎస్. గ్రీప్ సూచించారు.
భవిష్యత్తులో లంబసింగి బ్రాండ్‌పై విక్రయించాలి
కేవీటీసీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎస్.గ్రీప్
గిరిజన రైతులకు తేనెటీగల పెట్టెల పంపిణీ
చింతపల్లి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు తేనె ఉత్పత్తిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకోవాలని ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీటీసీ) రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎస్. గ్రీప్ సూచించారు. బుధవారం పెదబరడ గ్రామంలో తేనెటీగల పెంపకంలో పది రోజుల పాటు శిక్షణ పొందిన 40 మంది రైతులకు ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. ఒక్కొక్క రైతుకి రూ.40 వేల విలువైన జార్ఖండ్ నుంచి దిగుమతి చేసుకున్న పది తేనెటీగలతో కూడిన పెట్టెలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి విభిన్న వాతావరణం కలిగిన ప్రాంతమన్నారు. ఈ ప్రాంతంలో తేనె ఉత్పత్తికి అనువైన వాతావరణ పరిస్థితులు అందుబాటులో వున్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా గుర్తించారన్నారు. ఇప్పటికే లంబసింగి పరిసర ప్రాంత రైతులు అరుదైన ఉద్యాన, సుగంధ ద్రవ్య, కూరగాయల పంటలను పండిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ లంబసింగి పరిసర ప్రాంత ఆదివాసీ రైతులను ప్రోత్సహించేందుకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చామన్నారు. రైతులు తేనెటీగల పెట్టెలను సక్రమంగా నిర్వహించుకుంటే వారానికి రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల ఆదాయం వస్తుందన్నారు. తేనె ఉత్పత్తులు పెరిగితే అరకు కాఫీ తరహాలో లంబసింగి బ్రాండ్‌పై తేనెను మార్కెట్‌లో విక్రయించుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. 40 మంది రైతులతో ప్రారంభమైన తేనె పరిశ్రమ రానున్న రోజుల్లో వందల సంఖ్యలో ఆదివాసీలు భాగస్వాములు కావాలన్నారు. గిరిజన రైతులు ఉత్పత్తి చేసిన తేనెకు మార్కెట్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. కిలో తేనె ప్రాంతీయ మార్కెట్‌లో రూ.500 ధర పలుకుతుందని చెప్పారు. రైతులకు రానున్న రోజుల్లోనూ కేవీటీసీ ద్వారా సాంకేతిక సహకారం అందిస్తామన్నారు. అలాగే కుట్టుమిషన్లపై గిరిజన రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐఎంఆర్ శాస్త్రవేత్త కె.శ్రీనివాసరావు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు డి.సుబ్రహ్మణ్యం, ఐ.సాయిరామ్ నాయక్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ గసాడి బాబూరావు, యూబీఐ బ్యాంక్ మేనేజర్ కె.గౌతమ్‌కుమార్, సర్పంచ్ సమిడి గోపాల్, కార్యదర్శి బి.లక్ష్మీకుమార్, ఐఐఎంఆర్ ఎఫ్‌పీవో రిప్రజెంటేటివ్ జి.రాజేశ్, లంబసింగి ట్రైబల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు కూడ సరోజిని, ఇందిరరాణి, శోభారాణి, పృథ్వీరాజ్, కన్నబాబు పాల్గొన్నారు.