పేదలకు గృహయోగం!
ABN , Publish Date - May 27 , 2026 | 11:49 PM
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపడుతున్నది.
జిల్లాలో లక్షా 38 వేల 695 కుటుంబాలకు ఇళ్లు మంజూరు
ఇప్పటికీ ఇళ్లు లేని 59,409 కుటుంబాల గుర్తింపు
రానున్న మూడేళ్లలో వారందరికీ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు
ఇప్పటికే ఆయా లబ్ధిదారుల వివరాలతో సర్వే నివేదికను సర్కారుకు సమర్పించిన హౌసింగ్ అధికారులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ఇల్లు లేని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇల్లు మంజూరు చేసేందుకు అవసరమైన అధికారిక చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 59 వేల 409 కుటుంబాలకు ఇళ్లు లేవని గుర్తించారు. దీంతో వారందరికీ ఇళ్లను మంజూరు చేసేందుకు జియోట్యాగింగ్, ఇతర వివరాలను సేకరించి ప్రభుత్వానికి హౌసింగ్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. రానున్న మూడేళ్లలో ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0లో భాగంగా ప్రస్తుతం ఇళ్లు లేని 59 వేల 409 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయనుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించామని హౌసింగ్ పీడీ బి.బాబు, ఈఈ వి.రాజబాబు తెలిపారు.
పేదలకు గూడు కల్పించాలని భావించిన కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలకు ఇళ్లులున్నాయి?, ఇంకా ఎంత మందికి ఇళ్లు మంజూరు చేయాలనే అంశాలపై సమగ్రమైన సర్వే చేయాలని హౌసింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన హౌసింగ్ అధికారులు గ్రామాల వారీగా తమ సిబ్బందితో క్షేత్ర పర్యటనలు చేసి అందుకు సంబంఽధించిన సమగ్ర నివేదికను రూపొందించారు. జిల్లాలోని పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో గతం నుంచి 2021- 22 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా 97,007 కుటుంబాలకు ఇళ్లు సమకూరాయి. అలాగే 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ్ పథకంలో 12,997 కుటుంబాలకు, ఆ తరువాత ప్రధానమంత్రి జన్‌మన్ యోజనలో 28,691 కుటుంబాలకు కలిపి.. మొత్తం లక్షా 38 వేల 695 కుటుంబాలకు వివిధ పథకాల్లో ఇళ్లు మంజూరయ్యాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో ఇంకా 59 వేల 409 కుటుంబాలకు ఎటువంటి ఇళ్లు లేవని గుర్తించారు. దీంతో వారందరికీ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి హౌసింగ్ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. దీంతో రానున్న మూడేళ్లలో అంటే 2029 నాటికి వారందరికీ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో రానున్న మూడేళ్లలో ఇళ్ల మంజూరు వివరాలు
వ.సం. మండలం పేరు పంచాయతీలు మంజూరు చేసే ఇళ్ల సంఖ్య
1. ముంచంగిపుట్టు 23 6,130
2. పెదబయలు 23 6,013
3. అరకులోయ 14 5707
4. అనంతగిరి 24 5,610
5. డుంబ్రిగుడ 18 5,348
6. హుకుంపేట 33 4,907
7. జీకేవీధి 16 5,164
8. పాడేరు 26 5,147
9. కొయ్యూరు 33 3,259
10. జి.మాడుగుల 17 7,640
11. చింతపల్లి 17 4484
--------------------------------------------------------------------------------
మొత్తం 244 59,409
--------------------------------------------------------------------------------