Share News

దారుణంగా హోమియో ఆస్పత్రి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:50 PM

పాడేరులోని హోమియో ఆస్పత్రి దారుణంగా తయారైంది. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. కొన్నేళ్లుగా భవనంలో వైద్య సేవలు అందించకపోవడంతో మూలపడింది. హోమియో వైద్యశాల భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని పాలకుల ప్రకటనలు బుట్టదాఖలయ్యాయి.

దారుణంగా హోమియో ఆస్పత్రి
పాడేరు అధ్వానంగా ఉన్న హోమియో ఆస్పత్రి

జిల్లా కేంద్రంలో ఆస్పత్రినే పట్టించుకోని దుస్థితి

ఆక్రమణలకు గురవుతున్న భవనాలు, స్థలాలు

ఆస్పత్రి అభివృద్ధి ప్రకటనలకే పరిమితమా?

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రంలోని హోమియో ఆస్పత్రి పరిస్థితి అధ్వానంగా మారింది. గతకొన్నేళ్లుగా ప్రజల్లో వైద్యారోగ్య సేవలపై అవగాహన పెరుగుతుండడంతోపాటు హోమియో వైద్యంపై ఆసక్తి పెరుగుతోంది. అయితే జిల్లా కేంద్రం పాడేరులోని హోమియో ఆస్పత్రిపై చాలా ఏళ్లుగానే నిర్లక్ష్యం చూపడంతో భవనాలు శిథిలమయ్యాయి. ఆపై పరిసర స్థలాలు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్నాళ్లుగా హోమియో వైద్యశాలకు పూర్వవైభవం తీసుకువస్తామని పాలకులు ప్రకటిస్తున్నప్పటికీ స్థానిక హోమియో ఆస్పత్రికి మోక్షం కలగడం లేదు. భవనం శిథిలం కావడంతోపాటు అక్కడ ఎటువంటి సేవలు అందించకపోవడంతో జనం దానిని చూస్తూ నిట్టూర్చడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది

రూ.30 లక్షలు మంజూరు చేసినట్టు ప్రకటన

రాష్ట్ర వ్యాప్తంగా హోమియో వైద్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మరమ్మతులకు గురైన వైద్యశాలల భవనాలకు మరమ్మతులు చేపడతామని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు గతంలో ప్రకటించారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని హోమియో వైద్యశాలను రూ.30 లక్షలతో అభివృద్ధి చేస్తారని అప్పట్లో ప్రకటించారు. కాని వాస్తవానికి అటువంటివేమీ జరగలేదు. దీంతో ఎప్పటిలాగానే శిథిలమైన భవనంతో పరిసరాలు అధ్వానంగా మారాయి. ఎప్పటికైనా ప్రభుత్వం దీనికి పూర్వవైభవం తీసుకువస్తుందనే ఆశతో స్థానికులు ఎదురు చూస్తున్నారు.

విలువైన ఆస్తులపై అధికారుల నిర్లక్ష్యం

స్థానిక మెయిన్‌రోడ్డులో ఉన్న హోమియో ఆస్పత్రికి సంబంధించిన విలువైన ఆస్తులపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంగా పాడేరు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రతి చిన్న స్థలానికి ఎంతో విలువ పెరిగింది. ఈక్రమంలో మెయిన్‌రోడ్డులో ఉన్న హోమియో ఆస్పత్రికి చెందిన భవనం, పరిసర స్థలాలు ఎంతో విలువైనవి. ఆస్పత్రిని అభివృద్ధి చేసి విలువైన స్థలాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Apr 24 , 2026 | 11:50 PM