గిరిజనులకు గృహ యోగం
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:28 AM
జిల్లాలోని గిరిజనులకు గృహ యోగం కలిగింది. పీఎం జన్‌మన్ యోజనలో మంజూరైన ఇళ్లలో సోమవారం 1,,002 ఇళ్లకు ఘనంగా గృహ ప్రవేశాలు చేశారు.
జిల్లాలో రెండో విడత 1,,002 ఇళ్లలో ఘనంగా ప్రవేశాలు
వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
పాడేరులో లబ్ధిదారులకు దుస్తులతో పాటు తాళాలు అందజేసిన మంత్రి సంధ్యారాణి
పాడేరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజనులకు గృహ యోగం కలిగింది. పీఎం జన్‌మన్ యోజనలో మంజూరైన ఇళ్లలో సోమవారం 1,,002 ఇళ్లకు ఘనంగా గృహ ప్రవేశాలు చేశారు. పేదలకు సొంతిల్లు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుడూరు నుంచి ఆయా ఇళ్లకు వర్చువల్‌గా గృహప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని ఘనంగా నిర్వహించారు. తమ ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం పేదలకు సొంతింటి కలను నెరవేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
ఘనంగా గృహ ప్రవేశాలు
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో మొత్తం 659 ఇళ్లకు సోమవారం గృహ ప్రవేశాలు జరిగాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, హౌసింగ్ పీడీ బి.బాబు పాడేరు మండలం గొండెలి పంచాయతీ పిల్లిపుట్టు గ్రామంలో గిరిజనుల ఇళ్లకు గృహప్రవేశాలు చేశారు. అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానంలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మొత్తం 343 ఇళ్లకు గృహ ప్రవేశఽం చేశారు. అరకులోయ నియోజకవర్గంలోని పెదబయలు మండలం పులిగొంది గ్రామంలో ఆర్‌టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, హౌసింగ్ ఈఈ వి.రాజబాబు లాంఛనంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు ఇంటి తాళాలను అందజేశారు. తమ సొంతింటి కల నెరవేరడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.