సమస్యల నిలయం.. బీసీ గురుకులం
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:02 AM
మండలంలోని లింగరాజుపాలెంలో ‘బహుళ ప్రయోజన తుఫాన్ రక్షిత’ భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో వసతి కొరతతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనంలో ఆరు గదులు మాత్రమే వుండగా వీటిని తరగతుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. హాస్టల్ భవనం లేకపోవడంతో తరగతి గదులను రాత్రి పూట వసతిగా వినియోగించు కోవాల్సిన దుస్థితి నెలకొంది.
ఏడేళ్లయినా సొంత గూడుకు నోచుకోని బాలికల ఆశ్రమ పాఠశాల
లింగరాజుపాలెంలోని తుఫాన్ రక్షిత భవనంలో నిర్వహణ
ఐదు గదుల్లో ఆరు తరగతుల నిర్వహణ
వీటిల్లోనే పగలు బోధన.. రాత్రికి వసతి
బ్యాగులు, పెట్టెలతో ఇరుకుగా మారిన గదులు
డైనింగ్ హాలు లేకపోవడంతో కింద కూర్చొని భోజనాలు
అరకొరగా స్నానపు గదులు, మరుగుదొడ్లు
ఎస్.రాయవరం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లింగరాజుపాలెంలో ‘బహుళ ప్రయోజన తుఫాన్ రక్షిత’ భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో వసతి కొరతతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనంలో ఆరు గదులు మాత్రమే వుండగా వీటిని తరగతుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. హాస్టల్ భవనం లేకపోవడంతో తరగతి గదులను రాత్రి పూట వసతిగా వినియోగించు కోవాల్సిన దుస్థితి నెలకొంది.
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018 డిసెంబరులో అనకాపల్లి, నర్సీపట్నంలో బాలురకు; పాయకరావుపేట, చోడవరంలో బాలికలకు ‘మహాత్మా జ్యోతిబాఫూలే’ పేరుతో గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. పాయకరావుపేటకు కేటాయించిన పాఠశాలను 2019 జనవరిలో ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెంలోని ‘బహుళ ప్రయోజన తుఫాన్ రక్షిత’ భవనంలో అధికారులు ప్రాంభించారు. తరువాత స్థలం కేటాయించి, సొంత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి గురుకుల పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభించారు. ఈ సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. పాఠశాలను తాత్కాలికంగా ప్రారంభించిన తుఫాన్ రక్షిత భవనంలో మొత్తం ఆరు గదులు మాత్రమే వున్నాయి. పాఠశాలలో ఐదు నుంచి పదో తరగతి వరకు ఇక్కడ బోధిస్తుంటారు. ఇటీవల ముగిసిన విద్యా సంవత్సరంలో సుమారు 200 మంది విద్యార్థినులు వున్నారు. భవనంలో ఆరు గదులు వుండగా ఐదింటిని తరగతుల నిర్వహణ కమ్ వసతికి వినియోగిస్తున్నారు. మరో గదిని ప్రిన్సిపాల్/ స్టాఫ్ రూమ్/ ఆఫీసు నిర్వహణకు కేటాయించారు. హాస్టల్ భవనం లేకపోవడంతో పగలు తరగతులు నిర్వహించే గదులను, రాత్రి వసతిగా వినియోగించుకోవాల్సి వస్తున్నది. దీంతో తరగతి గదుల్లో బెచీలు వేయడానికి వీలులేక, విద్యార్థినులు గచ్చుపైనే కూర్చుకుంటున్నారు. పుస్తకాలు, బ్యాగులు, ట్రంకు పెట్టెలు, బకెట్లు వంటి సామగ్రిని తరగతి గదుల్లోనే వుంచాల్సి రావడంతో ఇరుకుగా మారింది. రాత్రిపూట గచ్చుపైనే నిద్రిస్తున్నారు. డైనింగ్ హాలు లేకపోవడంతో మధ్యాహ్నం, రాత్రి నేలపైనే కుర్చొని భోజనాలు చేస్తున్నారు. పాఠశాలలో క్రీడా మైదానం లేదు. కిచెన్‌కు ప్రత్యేక గది లేకపోవడంతో సెల్లార్‌లో పిల్లర్ల చుట్టూ పట్టలుకట్టి వంటలు చేస్తున్నారు. నీటి సదుపాయం లేకపోవవడంతో పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రికి చెందిన బోరుపై ఆధారపడుతున్నారు. 200 మందికిపైగా వున్న విద్యార్థినులకు సరిపడ స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. ఈ పాఠశాలకు స్థలం సమకూర్చడం, భవన నిర్మాణం విషయంలో వైసీపీ ఐదేళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు విద్యా సంవత్సరాలు ముగిశాయి. కానీ ఇంతవరకు కనీసం స్థలాన్ని కూడా కేటాయించలేదు. స్థలం సమకూర్చి, సొంత భవనాలు నిర్మించే వరకు పూర్తిస్థాయి వసతి వున్న వేరే భనవంలోకి పాఠశాలను మార్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చాలా ఇబ్బందిగా ఉంది
సాత్విక, 8వ తరగతి (9ఎస్‌ఆర్‌వీఎం7), దీక్షిత, 9వ తరగతి (9ఎస్‌ఆర్‌వీఎం8)
తరగతుల నిర్వహణకు, హాస్టల్‌కు వేర్వేరుగా గదులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. తరగతి గదులనే వసతి కోసం వాడుకోవాల్సి వస్తున్నది. బ్యాగులు, పెట్టెలు, ఇతర సామగ్రిని ఈ గదుల్లోనే వుంచాల్సి రావడంతో బోధన సమయంలో బెంచీలు, రాత్రిపూట నిద్రించడానికి బెడ్స్ వేయడానికి వీలు కావడంలేదు. దీంతో 24 గంటలూ గచ్చుపైనే కూర్చోడం లేదా నిద్రించడం చాలా ఇబ్బందిగా వుంది. డైనింగ్ హాలు లేకపోవడంతో సెల్లార్‌లో కింద కూర్చుని భోజనం చేస్తున్నాం.
హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాం
ఇ.లక్ష్మి, ప్రిన్సిపాల్ (9ఎస్‌ఆర్‌వీఎం9)
వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలను తుఫాన్ రక్షిత భవనంలో చాలీచాలని వసతితో నిర్వహిస్తున్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అయిన వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లాం. స్థలాన్ని కేటాయించి, సొంత భవనాలకు నిధులు మంజూరు చేయించాలని కోరాం. వెంటనే స్పందించిన ఆమె, గురుకుల పాఠశాలకు అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాలను పరిశీలిస్తున్నాం.