Share News

హోంగార్డుపై కత్తితో దాడి

ABN , Publish Date - May 31 , 2026 | 12:38 AM

జాతీయ రహదారి లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రధాన నిందితుడు పరారీ కాగా, ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది.

హోంగార్డుపై కత్తితో దాడి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రమణ

- ప్రధాన నిందితుడు పరారీ

- పోలీసుల అదుపులో ముగ్గురు!

లంకెలపాలెం, మే 30 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రధాన నిందితుడు పరారీ కాగా, ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలిలా వున్నాయి. కాకినాడకు చెందిన నలుగురు వ్యక్తులు విశాఖనగరం పీఎంపాలెంలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని అనకాపల్లి మండలం సిరసపల్లిలో గల బంధువుల ఇంటికి కారులో బయలుదేరారు. లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద కారును రహదారి పక్కనే నిలిపివేశారు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ భాస్కరరావు, హోంగార్డు కేవీ రమణలు రోడ్డు పక్కన ఉన్న కారును తీయాలని సూచించారు. సమయం 12 గంటలు అవుతుందని ఇక్కడ నుంచి వెళ్లాలని కోరారు. దీంతో వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిలో ఒక వ్యక్తి కత్తితో హోంగార్డు రమణపై దాడి చేసి గాయపరిచాడు. అక్కడ నుంచి ఆ నలుగురూ పరారయ్యారు. స్థానికుల సాయంతో తీవ్రంగా గాయపడిన హోంగార్డును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో శనివారం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దాడి చేసి పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు. పరవాడ సీఐ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 31 , 2026 | 12:38 AM