పీవీటీజీలకు గృహయోగం
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:42 PM
జిల్లాలోని ఆదిమ జాతి గిరిజనులకు(పీవీటీజీలు) గృహ యోగం పట్టింది. గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన తెగ అయిన పీవీటీజీలకు సొంత గూడు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రధానమంత్రి జన్‌మన్ యోజనని అమలు చేస్తోంది. ఈ పథకంలో జిల్లాకు 2,8691 ఇళ్లు మంజూరు చేసింది.
‘పీఎం జన్‌మన్’లో 28,691 ఇళ్లు మంజూరు
ప్రతి లబ్ధిదారుడికి రూ.2.38 లక్షలు
వివిధ దశల్లో 91 శాతం నిర్మాణాలు
ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచిస్తున్న హౌసింగ్ అధికారులు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
కొండకోనల్లో అత్యంత వెనుకబాటు జీవనం సాగిస్తున్న ఆదిమ జాతి గిరిజనులకు పక్కా ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్ యోజన పేరిట 2023 నవంబరు 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఆదిమ జాతి గిరిజనుడికి ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వాస్తవానికి రాష్ట్రాల్లో ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి నిర్మాణానికి రూ. 1.8 లక్షలు మాత్రమే మంజూరు చేస్తారు. కాని పీఎం జన్‌మన్ పథకంలో మంజూరైన ఇంటికి రూ.2 లక్షల 38 వేలు మంజూరవుతున్నది. ప్రధానంగా ఆదిమ జాతి గిరిజనులు పేరిదికంతో ఉండడంతోపాటు మారుమూల పల్లెల్లో ఉండడంతో వారి ఇంటి నిర్మాణ యూనిట్ ధరలను రూ. 2లక్షల 38 వేలకు పెంచారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇళ్లు లేని ఆదిమ జాతి గిరిజన కుటుంబాలను గుర్తించి వారికి ఇళ్లను మంజూరు చేశామని హౌసింగ్ అధికారులు తెలిపారు.
జిల్లాలో 28,691 ఇళ్లు మంజూరు
జిల్లాలోని 11 మండలాల్లో 1,028 గ్రామాల్లో జీవనం సాగిస్తున్న 28,691 ఆదిమజాతి గిరిజన కుటుంబాలకు పీఎం జన్‌మన్‌లో ఇళ్లను మంజూరు చేశారు. అరకులోయ అసెంబ్లీ స్థానం పరిధిలో పెదబయలు మండలంలో 3,224, ముంచంగిపుట్టులో 4,731, హుకుంపేటలో 1,762, డుంబ్రిగుడలో 1,303, అరకులోయలో 2,464, అనంతగిరిలో 864 ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జీకేవీధి మండలంలో 3,209, కొయ్యూరులో 938, చింతపల్లిలో 4,323, పాడేరులో 2,133, జీ.మాడుగులలో 3,740 మందికి ఇళ్లు మంజూరయ్యాయి.
ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి
పీఎం జన్‌మన్‌లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తిచేసుకోవాలని హౌసింగ్ పీడీ బి.బాబు, ఈఈ వి.రాజబాబు కోరారు. జిల్లాలోని 11 మండలాల్లో 28,691 ఇళ్లకు గానూ ఇప్పటికే 26,122 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇంకా 2,569 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకుంటే వెంటనే బిల్లులను మంజూరు చేస్తున్నామని, వాటికి నిధుల కొరత లేదని తెలిపారు.