Share News

అంబరాన్నంటిన హోలీ సంబరం

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:32 PM

మండలంలోని తాజంగి పంచాయతీ బీటాలైన్‌ రాధాకృష్ణ ఆలయ ప్రాంగణంలో మంగళవారం హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి.

అంబరాన్నంటిన హోలీ సంబరం
హోలీ వేడుకలో భాగంగా కర్రల పోగును దహనం చేస్తున్న దృశ్యం

తాజంగి బీటాలైన్‌లో 70 అడుగుల కర్రల పోగు దహనం

జెండాను పట్టుకున్న ఇద్దరు యువకులు

చింతపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి పంచాయతీ బీటాలైన్‌ రాధాకృష్ణ ఆలయ ప్రాంగణంలో మంగళవారం హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. రాధాకృష్ణ ఆలయంలో హోలీని పురస్కరించుకుని రెండు రోజులుగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన 70 అడుగుల హోలీ కర్రల పోగును అర్చకులు పూజలు చేసి కాల్చారు. తాజంగి బీటాలైన్‌ ఆదివాసీలు హోలీ సంబరాలను సంప్రదాయబద్ధంగా, విభిన్నంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ ఏడాది కూడా వారం రోజుల పాటు స్థానికులు శ్రమించి కర్రల పోగును ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అదే రోజు రాత్రి డ్యాన్స్‌ హంగామా సాంస్కృతిక కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కర్రల పోగుకు నిప్పుపెట్టారు. ఉదయం ఆరున్నర గంటల వరకు ఈ కర్రలపోగు కాలుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

జెండాను పట్టుకున్న ఇద్దరు యువకులు

కర్రల పోగుపై ఏర్పాటుచేసిన జెండాను ఇద్దరు యువకులు పట్టుకున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి జెండాను పట్టుకునేందుకు కర్రల పోగు చుట్టూ యువకులు, పెద్దలు భారీగా చేరుకున్నారు. ఉదయం 5:50 గంటలకు కర్రల పోగు నుంచి జెండా వేరై ఉత్తర దిక్కున పడింది. ఈ జెండాను యానంకు చెందిన కులుప విజయ్‌, తాజంగి పంచాయతీ రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన వంటల శ్రీనివాస్‌ కలిసి పట్టుకున్నారు. దీంతో ఆ ఇద్దరు యువకులను ఆలయ కమిటీ ప్రతినిధులు సత్కరించి రూ.1116 నగదును అందజేశారు. అలాగే తాజంగి పొలిమేర వరకు విజయ్‌, శ్రీనివాస్‌లను ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక యువత ఊరేగింపుగా తీసుకొచ్చింది. రానున్న ఖరీఫ్‌లో వివిధ పంటల నాట్లును జెండా పట్టుకున్న యువకులతో స్థానిక గిరిజనులు మొదటిగా వేయిస్తారు. ఈ ఉత్సవంలో ఎంపీపీ కోరాబు అనుషదేవి, సర్పంచ్‌ వంతల మహేశ్వరరావు, అర్చకులు సీసా నీలకంఠం, ఉత్సవ కమిటీ సభ్యులు బాబూరావు, సదాశివ, రాజరావు, శ్రీరామ్‌, శెట్టి శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 11:32 PM