హమ్మయ్య.. కష్టాలు తీరాయి..
ABN , Publish Date - May 01 , 2026 | 12:18 AM
పాడేరు మండలం రాయిగెడ్డపై వంతెన నిర్మించడంతో రెండు మండలాల గిరిజనులకు వరద కష్టాలు తీరాయి. వర్షాకాలంలో ఒక మోస్తరు వర్షం పడినా రాయిగెడ్డ కాజ్‌వేపై నీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.5.44 కోట్లతో వంతెన నిర్మించడంతో నాలుగు పంచాయతీల్లోని పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.
రాయిగెడ్డ కాజ్‌వేపై వంతెన
రూ.5.44 కోట్లతో నిర్మాణం
పాడేరు, జి.మాడుగుల మండలాల్లో
నాలుగు పంచాయతీల ప్రజలకు మేలు
పదుల సంఖ్యలో గ్రామాలకు ప్రయోజనం
గిరిజనుల ఆనందం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు మండలంలో రాయిగెడ్డ కాజ్‌వేపై వంతెన నిర్మాణంతో పదుల సంఖ్యలో గ్రామాల గిరిజనుల వరద కష్టాలు తీరాయి. వర్షాకాలంలో పాడేరు మండలంలో రాయిగెడ్డపై నిర్మించిన కాజ్‌వే పైనుంచి వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అనేక సందర్భాల్లో వరద ఉధృతి తగ్గేవరకు వేచి ఉండడం లేదా తిరిగి వెనక్కి వెళ్లిపోవడం చేసేశారు. అలాగే రాయిగెడ్డ కాజ్‌వే పైనుంచి జి.మాడుగుల నుంచి వచ్చే మత్స్యగెడ్డ నీటి ప్రవాహం కలవడంతో వర్షం కురిసిస్తే చాలు గెడ్డను దాటలేనంత ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే కాజ్‌వే కూడా చాలా ఏళ్లు క్రితం నిర్మించింది కావడం.. తక్కువ ఎత్తులో ఉండడంతో వర్షం కురిస్తే చాలు అటు ఇటు రాకపోకలు నిలిచిపోవడం సర్వసాధారణంగా మారింది. పాడేరు మండలంలో ఇరడాపల్లి, గొండెలి, బడిమెల పంచాయతీలు, జి.మాడుగుల మండలానికి చెంది కె.కోడాపల్లి పంచాయతీకి చెందిన గ్రామాల గిరిజనులు ఈమార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వర్షా కాలంలో అందరూ ఇబ్బందులు పడుతుంటారు.
వంతెన నిర్మాణంతో తీరిన కష్టాలు
ఎట్టకేలకు ప్రధానమంత్రి గ్రామసడక్ యోజనలో భాగంగా రాయిగెడ్డ కాజ్‌వేపై రూ.5 కోట్ల 44 లక్షల వ్యయంతో వంతెన నిర్మించారు. దీంతో గిరిజనుల కష్టాలు తీరాయి. ఇకపై భారీ వరదలు సంభవించినా ఇబ్బందులు తలెత్తే అవకాశఽం లేదు. గతానికి భిన్నంగా భవిష్యత్తులో సైతం తమకు వరదల కష్టాలు ఉండబోవని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.