Share News

‘రిజెక్ట్‌’తో లక్ష్యానికి తూట్లు

ABN , Publish Date - May 30 , 2026 | 12:44 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయని విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు/ కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో పలువురు రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఆయా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇందుకు ససేమిరా అంటున్నాయి. ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ముందుకు వస్తే విద్యా శాఖ అధికారులు వారి తల్లిదండ్రుల నుంచి దరఖాస్తు తీసుకొని, సంబంధిత పోర్టల్‌లో ప్రైవేటు యాజమాన్యానికి రిక్వెస్టు పెడుతున్నారు. కానీ దీనిని ప్రైవేటు యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి.

‘రిజెక్ట్‌’తో లక్ష్యానికి తూట్లు
నర్సీపట్నంలో ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ముందుకు వచ్చిన తల్లి నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రైవేటు యాజమాన్యాల బ్రేకులు

విద్యార్థులను రిలీవ్‌ చేయడానికి విముఖం

దిక్కుతోచని స్థితిలో విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు

నర్సీపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయని విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు/ కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో పలువురు రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఆయా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇందుకు ససేమిరా అంటున్నాయి. ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ముందుకు వస్తే విద్యా శాఖ అధికారులు వారి తల్లిదండ్రుల నుంచి దరఖాస్తు తీసుకొని, సంబంధిత పోర్టల్‌లో ప్రైవేటు యాజమాన్యానికి రిక్వెస్టు పెడుతున్నారు. కానీ దీనిని ప్రైవేటు యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. అడ్మిషన్‌ డ్రైవ్‌ పేరుతో విద్యా శాఖ అధికారులు, ఉపాఽధ్యాయులు ఇంటింటికీ వెళుతున్నారు. బడిఈడు పిల్లలతోపాటు గత ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. ఈ ప్రక్రియను నిరంతరం జిల్లా కలెక్టర్‌ నుంచి జిల్లా, మండల విద్యా శాఖ అధికారుల వరకు పర్యవేక్షణ చేస్తున్నారు. రోజూ వెబ్‌ సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పురోగతిపై ఆరా తీస్తున్నారు. ప్రవేశాలను వేగవంతం చేయడానికి దిశానిర్దేశం చేస్తున్నారు. లక్ష్యం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి ఉపాధ్యాయులు మండుటెండను సైతం లెక్కచేయకుండా గడప గడపకూ వెళుతున్నారు. ఇటీవల వరకు ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్థుల వివరాలను సేకరించి, వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు, నాణ్య మైన విద్యా బోధన, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వారి వివరించి, ప్రభుత్వ పాఠశాలలో చేరిక కోసం దరఖాస్తు చేయిస్తున్నారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎం.. ప్రభుత్వ అధికారిక పోర్టల్‌ ‘యుడైజ్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) లో లాగిన్‌ అయి, సదరు విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపారంటూ రిక్వస్ట్‌ పెట్టి, విద్యార్థిని రిలీవ్‌ చేయాలని కోరుతున్నారు. కానీ ప్రైవేటు యాజమాన్యాలు దీనిని తిరస్కరిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ముందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఆయా ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఫోన్లు చేసి, ఫీజులు తగ్గిస్తామని, నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతున్నారు. మరికొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఒకడుగు ముందుకు వేసి... తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న రూ.15 వేలు మాత్రమే తమకు ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని, మీ చేతి డబ్బులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు మెత్తబడి, మళ్లీ ఈ ఏడాది కూడా ప్రైవేటు పాఠశాలలోనే చదివించడానికి మొగ్గుచూపుతున్నారు. దీని వల్ల ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారుల శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నదని అంటున్నారు. ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వ విధించిన లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని వాపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ‘రిజెక్ట్‌’పై నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారి తలుపులును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలు ఒకసారి రిజెక్ట్‌ చేస్తే.. తర్వాత రెండోసారి రిక్వెస్ట్‌ పెడతామని, అప్పుడు కూడా రిజెక్ట్‌ కొడితే జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళతామని అన్నారు.

Updated Date - May 30 , 2026 | 12:44 AM