Share News

పాడేరు డివిజన్‌పైనే ప్రేమ!

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:30 AM

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్టుచేసిన పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విశ్రాంత సూపరింటెండింగ్‌ ఇంజనీరు కె.శ్రీనివాసరావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

 పాడేరు డివిజన్‌పైనే ప్రేమ!

విశాఖలో ఎస్‌ఈగా పనిచేసినా అక్కడే బాధ్యతలు

రిటైర్డు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు నిర్వాకం

2022 జూన్‌ నుంచి 2024 సెప్టెంబరు వరకు విశాఖ డివిజన్‌లో రూ.231.64 కోట్ల బిల్లుల చెల్లింపు

వివరాల వెల్లడిపై పాడేరు డివిజన్‌ అధికారుల మౌనం

విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్టుచేసిన పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విశ్రాంత సూపరింటెండింగ్‌ ఇంజనీరు కె.శ్రీనివాసరావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల విలువైన పనులు చేపట్టే పాడేరు డివిజన్‌ మొత్తం తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. విశాఖలో ప్రాజెక్ట్సు ఈఈగా పనిచేసే సమయంలోనే జిల్లాల విభజన జరిగింది. ఆ సమయంలో విశాఖతోపాటు పాడేరు ప్రాజెక్ట్సు ఈఈగా పనిచేశారు. 2024 సెప్టెంబరు 1న విశాఖలో పంచాయతీరాజ్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా పదోన్నతి పొంది, గత ఏడాది డిసెంబరు నెలాఖరున ఉద్యోగ విరమణ చేసే వరకు పాడేరు ప్రాజెక్ట్సు ఈఈగా పనిచేశారు. అంతేకాదు పాడేరు ఈఈగా ఎవరూరాకుండా చూడగలిగారని కిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు.

సాధారణంగా ఎస్‌ఈగా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న తరువాత ఈఈ పోస్టులలో ఉండరు. కాని వందల కోట్లవిలువైన పనులు చేపట్టే ప్రాజెక్ట్సు డివిజన్‌ అతనికి కల్పతరువుగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శ్రీనివాసరావు 2022 జూన్‌ ఆరోతేదీన విశాఖలో ప్రాజెక్ట్సు ఈఈగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ రోజు నుంచి 2024 సెప్టెంబరులో ఎస్‌ఈగా పదోన్నతి పొందే వరకు అంటే సుమారు రెండు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో వందల సంఖ్యలో బిల్లులు మంజూరు చేసి, కాంట్రాక్టర్లకు రూ.231.64 కోట్లు చెల్లించారు. 2022 జూన్‌ ఐదు నుంచి 2023 మార్చి 31 వరకు రూ.127.53 కోట్లు, 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు రూ. 96.42 కోట్లు, 2024 ఏప్రిల్‌ ఒకటి నుంచి సెప్టెంబరు 23 వరకు (ఎస్‌ఈగా పూర్తిస్థాయి హోదాలో వెళ్లిపోయారు. ఈ సమయంలో విశాఖలో ప్రాజెక్ట్సు ఈఈ బాధ్యతలు వేరొకరికి ఇచ్చినా పాడేరు ప్రాజెక్ట్సు ఈఈగా కొనసాగారు) రూ. 7.6 కోట్లు విలువైన బిల్లులు మంజూరుచేశారు.

వివరాలపై విముఖత

ఇదిలా వుండగా పాడేరు ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం తగ్గించేందుకు అనేక మారుమూల ప్రాంతాలకు రోడ్లు నిర్మించారు. కేంద్రం ఇచ్చే నిధులతో ప్రాజెక్ట్సు డివిజన్‌ పరిఽధిలో చేపట్టే పనుల బిల్లులు వివరాలను వెల్లడించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. జిల్లాల విభజన తరువాత విశాఖ కంటే పాడేరు ప్రాజెక్ట్సు డివిజన్‌లో ఎక్కువ పనులు చేపట్టారు. ఉద్యోగ విరమణకు ముందు రెండుమూడు నెలల్లో భారీగా బిల్లులు మంజూరుచేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్పు ఈఈగా శ్రీనివాసరావు పనిచేసే సమయంలో మొత్తం పనులు, చెల్లించిన బిల్లుల వివరాలు తమ వద్ద లేవని పాడేరులోని అధికారులు తప్పించుకుంటున్నారు. ఇదిలావుండగా శ్రీనివాసరావును ఏసీబీ అరెస్టుచేసిన నేపథ్యంలో పాడేరు ప్రాజెక్ట్సులో నిర్మించిన రోడ్ల నాణ్యతపై విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలకు ఫిర్యాదుచేయాలని పలువురు నిర్ణయించినట్టు సమాచారం.

Updated Date - Feb 09 , 2026 | 12:30 AM