అమృతపురంలో కొండ కబ్జా
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:38 AM
మండలంలోని అమృతపురం గ్రామంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. రాజకీయ పార్టీలకు అతీతంగా కొంతమంది స్థానిక నాయకులు, వారి అనుచరులు ప్రభుత్వ భూములను ఆక్రమించడం, సెంట్లు చొప్పున అమ్ముకోవడాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు.
తొలుత గ్రావెల్ తవ్వకాలు.. ఎత్తుపల్లాలు చదును
సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలుగా విక్రయం
రెవెన్యూ శాఖ నుంచి పొజిషన్ పట్టాలు ఇప్పిస్తామని భరోసా
సబ్బవరం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అమృతపురం గ్రామంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. రాజకీయ పార్టీలకు అతీతంగా కొంతమంది స్థానిక నాయకులు, వారి అనుచరులు ప్రభుత్వ భూములను ఆక్రమించడం, సెంట్లు చొప్పున అమ్ముకోవడాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు.
అమృతపురం పంచాయతీలో సర్వే నంబరు 303/2లో సుమారు 56 ఎకరాల కొండ పోరంబోకు భూమి ఉంది. ఇది విశాఖ- రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎకనమిక్ కారిడార్‌లో భాగమై, ప్రస్తుతం నిర్మాణంలో వున్న షీలానగర్- సబ్బవరం సాగరమాల రోడ్డును ఆనుకొని ఉంది. ఇంకా సూరెడ్డిపాలెం వద్ద నిర్మాణం జరుగుతున్న డబుల్ ట్రపెంట్‌కు చేరువులో వుంది. దీంతో ఇక్కడ భూములకు ఎనలేని గిరాకీ ఏర్పడింది. కొంతమంది అక్రమార్కుల కళ్లు సర్వే నంబరు 303/2లోని కొండ పోరంబోకు భూములపై పడ్డాయి. కొంతమంది స్థానిక నేతల అండదండలతో సుమారు 15 సెంట్లు కొండపోరంబోకు భూమిని చదును చేసి, ప్లాటుగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ జిరాయితీ అయితే సెంటు రూ.5-6 లక్షలు పలుకుతున్నది. ప్రభుత్వ కొండపోరంబోకు భూమిని అక్రమించిన వారు సెంటు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నారు. పైడా రెవెన్యూ అధికారులతో మాట్లాడి, ఇంటి స్థలం పట్టా (పొజిషన్ సర్టిఫికెట్) మంజూరు చేయిస్తామని భరోసా ఇస్తున్నారు.
ఇదిలావుండగా 2020వ సంవత్సరంలో ఇక్కడి కొండ పోరంబోకు భూమిను ఆక్రమించి లే అవుట్ వేసేందుకు కొంతమంది ప్రయత్నించగా స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సర్వే నంబరుకు సంబంధించిన భూమిపై హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ కబ్జాలు మాత్రం ఆగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత కొండవాలు ప్రదేశంలో గ్రావెల్ తవ్వడం, తరువాత ఎత్తుపల్లాలను సరిచేయడం, ఇంటి స్థలంగా అమ్ముకోవడం ఇక్కడ పరిపాటిగా మారిందని అంటున్నారు. రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కాగా అమృతపురం శివారు చింతగట్లఅగ్రహారం సర్వే నంబరు 35లోని ప్రభుత్వ భూమిలో కొద్ది రోజుల నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అమృతపురం, చింతగట్లఅగ్రహారం గ్రామాల్లో ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.