ఉల్లాసంగా...ఉత్సాహంగా
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:30 AM
విశాఖ ఉత్సవ్ ప్రభావం ఇప్పుడు నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది.
అన్ని ప్రాంతాల్లోను ‘ఉత్సవ్’ కార్యక్రమాల నిర్వహణ
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో నిర్వాహకులు, అధికారుల దిద్దుబాటు చర్యలు
మొదలైన కయాకింగ్, మిస్టర్ క్రౌన్ పోటీలు
ఆర్కే బీచ్‌లో సినీ గాయని గీతామాధురి సంగీత విభావరి
విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్ ప్రభావం ఇప్పుడు నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది. సందర్శకుల్లో ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఉత్సవాలు ఆరంభంలో సమన్వయం కొరవడి చప్పగా సాగడంతో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. దాంతో నిర్వాహకులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకటించిన కార్యక్రమాలన్నీ జరిగేలా శ్రద్ధ తీసుకుంటున్నారు.
రుషికొండలో బుధవారం ఉదయం మత్స్యకారులకు కయాకింగ్ పోటీలు నిర్వహించగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. అదేవిధంగా మిస్ వైజాగ్, మిస్టర్ వైజాగ్, కిడ్ వైజాగ్ టైటిళ్లతో ‘క్రౌన్ వైజాగ్’ పోటీలను ఎండాడలోని వీఎంఆర్‌డీఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా భీమిలిలో తొలిరోజు (మంగళవారం) సాంస్కృతిక ప్రదర్శనలకు జనాలు లేకపోవడంతో రెండు రోజు స్థానిక నాయకులు కూడా చొరవ తీసుకోవడంతో బుధవారం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మరోవైపు ఆర్కే బీచ్‌లోని ప్రధాన వేదికపై పాపులర్ సినీ గాయని గీతా మాధురి తన గళం విప్పడంతో ఎక్కడెక్కడో ఉన్న సందర్శకులంతా వేదిక వద్దకు చేరి చప్పట్లతో హుషారెత్తించారు. ‘మహానుభావుడివేరా...’అనే పాటతో శ్రీకారం చుట్టి ‘మగాళ్లు వట్టి మాయగాళ్లే..ప్రేమంటే ఏమిటో తెలియదే ...’, ‘ప్రియతమా నీవచట కుశలమా?’ పాటలు ఆలపించారు. జాము రాతిరి...జాబిలమ్మా అంటూ సముద్రం పైనున్న చందమామను చూపిస్తూ తనదైన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు. అదేవిధంగా నోవాటెల్ హోటల్ ఎదురుగా స్థానిక కళాకారుల కోసం ఏర్పాటుచేసిన వేదికపై చక్కటి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఫుడ్ స్టాళ్లు వేడి వేడి వంటకాలతో ఘుమఘుమలాడించాయి.
నేటి నుంచి ఫ్లవర్‌షో
సిటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటు
రేపటి నుంచి అనకాపల్లిలో...
విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్‌లో భాగంగా వీఎంఆర్‌డీఏ పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నదని మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ బుధవారం తెలిపారు. విశాఖలోని సిటీ సెంట్రల్ పార్కులో గురువారం ఉదయం దీనిని ప్రారంభించి శుక్ర, శనివారాలు సందర్శకులను ఉచితంగా అనుమతిస్తామన్నారు. అలాగే అనకాపల్లి ఉత్సవ్ కోసం శుక్రవారం నుంచి అక్కడి బెల్లం మార్కెట్‌లో పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి కోసం బెంగళూరు, కోల్‌కత్తాతో పాటు కడియం నుంచి వివిధ రకాల పుష్పాలు రప్పిస్తున్నామన్నారు. దేశవాలీ పుష్పాలతో పాటు హైబ్రిడ్ రకాలైన డచ్ రోజ్, కార్నేషన్, అస్ట్రోమెరియా, ఆంథోరియమ్స్, గ్లాడియోలా, ట్యూబ్ రోజ్, జిప్సీలను ప్రదర్శనకు పెడుతున్నామన్నారు. వాటితో పాటు సైకత శిల్పాలు, వెజిటబుల్ కార్వింగ్, ఐస్ కార్వింగ్, పుష్పాలతో వివిధ రకాల ఆకృతులు, సెల్ఫీ పాయింట్లు పెడుతున్నామన్నారు. నగర ప్రజలు తప్పనిసరిగా సందర్శించాలని కోరారు.