హైవే పనులతో అగచాట్లు
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:05 AM
జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్ కనీస నిబంధనలు పాటించడంలేదు. దీంతో వర్షాకాలంలో బురదతో, ఇతర రోజుల్లో దుమ్ము, ధూళితో రహదారి పక్కనున్న గ్రామాల ప్రజలతోపాటు ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాహనాల రాకపోకలతో ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళ్లి
ఇబ్బంది పడుతున్న పలు గ్రామాల ప్రజలు
పట్టించుకోని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం
జి.మాడుగుల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్ కనీస నిబంధనలు పాటించడంలేదు. దీంతో వర్షాకాలంలో బురదతో, ఇతర రోజుల్లో దుమ్ము, ధూళితో రహదారి పక్కనున్న గ్రామాల ప్రజలతోపాటు ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో బందవీధి మలుపుల వద్ద, జి.మాడుగులలో కాంక్రీట్ మిక్చర్‌తో రోలింగ్ చేశారు. పలుచోట్ల మట్టి పనులు చేసి వదిలేశారు. సుమారు మూడు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో వాహనాలు రాకపోకల సమయంలో దుమ్ము, ధూళి విపరీతంగా గాల్లోకి లేస్తున్నది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వున్న దుకాణాలు, ఇళ్లల్లో ఎర్రటి దమ్ముకు పేరుకుపోతున్నది. దీనివల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలబారిన పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇక వాహన చోదకులతోపాటు వాహనాల్లో ప్రయాణించే వారి కళ్లల్లో దుమ్ము పడుతున్నది. ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతున్నప్పటికీ రహదారిని నీటితో తడపకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.