Share News

శరవేగంగా హైవే పనులు

ABN , Publish Date - May 07 , 2026 | 12:07 AM

రాజమహేంద్రవరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాకు అనుసంధానిస్తూ జాతీయ రహదారి(516-ఈ) నిర్మాణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.

శరవేగంగా హైవే పనులు
చింతపల్లి మండల కేంద్రం నుంచి కేడీపేట వైపు పూర్తయిన హైవే రోడ్డు

రాజమహేంద్రవరం నుంచి అల్లూరి జిల్లా మీదుగా విజయనగరం వరకు..

చకచకా రెండు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం

మొత్తం 371 కిలోమీటర్లు, అంచనా వ్యయం రూ.1,575 కోట్లు

ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి చింతపల్లి, పాడేరు నుంచి అరకులోయ, బొడ్డవర నుంచి విజయనగరం వరకు పూర్తయిన రోడ్డు నిర్మాణం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాకు అనుసంధానిస్తూ జాతీయ రహదారి(516-ఈ) నిర్మాణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. చాలా వరకు రోడ్డు నిర్మాణం జరగడంతో రవాణా కష్టాలు తొలగి సుఖ ప్రయాణం సాగుతుందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి చింతపల్లి మండలం లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మీదుగా విజయనగరం జిల్లా బొడ్డవర వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లా బొడ్డవర వరకు సుమారుగా 371 కిలోమీటర్ల జాతీయ రహదారిని రూ.1,575 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది.

ప్రస్తుతం జిల్లాలో హైవే పనుల స్థితిగతులివే..

జిల్లాలో ప్రస్తుతం జాతీయ రహదారి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే ఏజెన్సీలో కొయ్యూరు, జీకేవీఽధి, చింతపల్లి మండలాల్లోని రోడ్డు పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి. అక్కడక్కడ చిన్నపాటి ప్యాచ్‌ వర్క్‌లు మినహా కాకరపాడు నుంచి చింతపల్లి(లంబసింగి) వరకు హైవే పూర్తయింది. అలాగే లంబసింగి నుంచి తాజంగి మీదుగా జి.మాడుగుల, అక్కడ నుంచి పాడేరు వరకు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనిలో అక్కడక్కడ రోడ్డు నిర్మాణం జరగ్గా కొన్ని చోట్ల మట్టి పనులు, కాల్వర్టుల నిర్మాణం వంటికి కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాడేరు నుంచి హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు శత శాతం పూర్తయ్యాయి. హుకుంపేట మండలం పెదగరువు ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి నుంచి టోల్‌ ఫీజులు సైతం వసూలు చేస్తున్నారు. అలాగే అరకులోయలోని భల్లుగూడ నుంచి బొడ్డవర వరకు ఉన్న 43 కిలోమీటర్ల రోడ్డు పనులు ఇంకా మొదలు కాలేదు. దాదాపుగా 80 శాతం ఘాట్‌ మార్గంతో పాటు ఎక్కువగా అటవీ శాఖకు చెందిన ప్రాంతం కావడంతో ఈ మార్గంలోని పనులు ప్రారంభమయ్యేందుకు మరింత సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జాతీయ రహదారి నిర్మాణానికి 2018లోనే బీజం

గతంలో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుంచి విశాఖ ఏజెన్సీ మీదుగా విజయనగరానికి జాతీయ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదన 2018లోనే కార్యరూపం దాల్చింది. దీంతో ఏజెన్సీలో కొయ్యూరు నుంచి చింతపల్లి, పాడేరు మీదుగా అరకులోయ వరకు ఉన్న 12 అడుగుల వెడల్పున్న ప్రధాన రహదారిని 23 అడుగుల రహదారిగా రోడ్లు, భవనాల శాఖ విస్తరిస్తే, తర్వాత దానిని తాము 34(తారురోడ్డు) అడుగుల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామని నేషనల్‌ హైవే అథారిటీ అఽధికారులు రాష్ట్రంలోని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే 2018, 2019 సంవత్సరాల్లో ఏజెన్సీలోని కొయ్యూరు నుంచి పాడేరు మీదుగా అరకులోయ వరకు ఉన్న రోడ్డును 12 అడుగుల నుంచి 23 అడుగులకు విస్తరించారు. ఆయా రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడంతో జాతీయ రహదారి నిర్మాణానికి నేషనల్‌ హైవే అథారిటీ అఽధికారులు 2020లో తమ పనులు మొదలుపెట్టారు. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, కాకరపాడు(కొయ్యూరు), లంబసింగి, తాజంగి, జి.మాడుగల మండలం వంజరి, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, విజయనగరం వరకు సుమారుగా 371 కిలోమీటర్ల రోడ్డును ఆరు బ్లాక్‌లుగా విభజించారు.

హైవే నిర్మాణం జరిగే ఆరు బ్లాకులివే..

- రాజమండ్రి నుంచి రంపచోడవరం 44 కిలోమీటర్లు

- రంపచోడవరం టూ కాకరపాడు 74 కిలోమీటర్లు

- కాకరపాడు - లంబసింగి, జి.మాడుగుల మీదుగా పాడేరు 134 కిలోమీటర్లు,

- పాడేరు - కొత్తభల్లుగుడ 49 కిలోమీటర్లు

- భల్లుగుడ - బొడ్డవర 43 కిలోమీటర్లు

- బొడ్డవర- విజయనగరం 27 కిలోమీటర్లు

Updated Date - May 07 , 2026 | 12:07 AM