Share News

హైవే పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:32 PM

జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516ఈ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి నేషనల్‌ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు.

హైవే పనులు వేగవంతం చేయాలి
పాడేరు- చింతపల్లి హైవేలో ఉరుము వద్ద రోడ్డును పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిశాంతి

ఎన్‌హెచ్‌ఏ అధికారులకు కలెక్టర్‌ నిశాంతి ఆదేశం

ప్రజల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకూడదు

ప్రతి సోమవారం విధిగా మండల స్థాయి గ్రీవెన్స్‌ నిర్వహించాలి

పాడేరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516ఈ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి నేషనల్‌ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు. ఆదివారం పాడేరు-చింతపల్లి మార్గంలో జి.మాడుగుల మండలం ఉరుము ప్రాంతంలోను, పాడేరు బైపాస్‌కు జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. అనంతరం అక్కడే హైవే అథారిటీ అధికారులతో ఆమె మాట్లాడారు. రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. పనులు నాణ్యతగా, వేగంగా జరగాలన్నారు. వర్షాలు కురిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయని, అందువల్ల వర్షాకాలంలోపే బైపాస్‌ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అయితే బైపాస్‌ పనులు ఈఏడాది నవంబరు నాటికి పూర్తి చేయగలమని ఇంజనీరు కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన సంపూర్ణ వివరాలతో సోమవారం కలెక్టరేట్‌కు రావాలని కలెక్టర్‌ నిశాంతి హైవే అథారిటీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సైట్‌ ఇంజనీర్‌ లోకేశ్‌, టెక్నికల్‌ టీం లీడర్లు శ్రీనివాస్‌, రవికుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మండలాల్లోలో విధిగా సోమవారం మీకోసం

ప్రతి సోమవారం మండల స్థాయిలో మీకోసం కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె క్యాంప్‌ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మండల స్థాయిలో సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరుకావాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అధికారులు గైర్హుజరు కాకూడదన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటిని ఆయా శాఖల అధికారులకు బట్వాడ చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు వాటిని పరిశీలించి పక్కాగా పరిష్కరించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లాలోని 11 మండలాలకు చెందిన ప్రత్యేకాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:32 PM