Share News

జోరుగా హైవే పనులు

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:21 AM

విశాఖపట్నం-రాయ్‌పూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భాగమైన సబ్బవరం- షీలానగర్‌ ఆరు లేన్ల రహదారి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. సబ్బవరం మండల పరిధిలో చిన్నయ్యపాలెం వద్ద ఇంటర్‌చేంజ్‌, సూరెడ్డిపాలెం వద్ద డబుల్‌ ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భూమి చదును పనులు, ల్యాండ్‌ ఫిల్లింగ్‌, డ్రైనేజీల నిర్మాణానికి కాలువల తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ యంత్రాలు, పదుల సంఖ్యలో కార్మికులు రేయింబవళ్లు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తున్నారు.

జోరుగా హైవే పనులు
చిన్నయ్యపాలెం నుంచి రాయపూర్‌ వైపు పూర్తయిన గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్సప్రెస్‌ హైవే

చకచకా సబ్బవరం-షీలానగర్‌ ఆరు లేన్ల రహదారి నిర్మాణం

చిన్నయ్యపాలెం వద్ద ఇంటర్‌ చేంజ్‌

సూరెడ్డిపాలెం వద్ద డబుల్‌ ట్రంపెట్‌

రహదారి మొత్తం 12.66 కి.మీ.

వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని అంచనా

సబ్బవరం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం-రాయ్‌పూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భాగమైన సబ్బవరం- షీలానగర్‌ ఆరు లేన్ల రహదారి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. సబ్బవరం మండల పరిధిలో చిన్నయ్యపాలెం వద్ద ఇంటర్‌చేంజ్‌, సూరెడ్డిపాలెం వద్ద డబుల్‌ ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భూమి చదును పనులు, ల్యాండ్‌ ఫిల్లింగ్‌, డ్రైనేజీల నిర్మాణానికి కాలువల తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ యంత్రాలు, పదుల సంఖ్యలో కార్మికులు రేయింబవళ్లు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తున్నారు.

సబ్బవరం-షీలానగర్‌ మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మాణం పనులకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రూ.963.93 కోట్లు మంజూరుచేసింది. సబ్బవరం మండలం అమృతపురం పంచాయతీ శివారు సూరెడ్డిపాలెం నుంచి జెర్రిపోతులపాలెం, చింతగట్ల, నరవ మీదుగా షీలానగర్‌ వరకు 12.66 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఎలివేటెడ్‌ (ఫైఓవర్‌ వంతెన) కారిడార్‌ ఉంటుంది. ఇది షీలానగర్‌ వద్ద ఎన్‌హెచ్‌-16కు, విశాఖపట్నం పోర్టు రహదారికి అనుసంధానం అవుతుంది. వాస్తవంగా 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా భూ సేకరణలో తీవ్ర జాప్యం జరిగింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కదలిక వచ్చింది. విశాఖ-రాయ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను ఏపీలో నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. నాలుగో ప్యాకేజీ కింద విజయనగరం జిల్లా కంటకాపల్లి నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం వరకు రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. ఇది సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద అనకాపల్లి-ఆనందపురం హైవేలో కలుస్తుంది. ఇక్కడ ఇంటర్‌చేంజ్‌ పనులు జరుగుతున్నాయి. రాయ్‌పూర్‌ నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఇక్కడి నుంచి సుమారు కిలోమీటరు దూరంలోని సూరెడ్డిపాలెం వరకు అనకాపల్లి-ఆనందపురం హైవేలోనే ప్రయాణించాలి. ఇక్కడ డబుల్‌ ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. విశాఖ షీలానగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు మూడు వైపులా..అంటే రాయపూర్‌/ఆనందపురం, అనకాపల్లి వైపునకు సాఫీగా వెళ్లేలా భారీఎత్తున దీనిని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివరినాటికి సబ్బవరం-షీలానగర్‌ ఆరు వరుసల రహదారి అందుబాటులోకి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. దీంతో విశాఖ నగరంలోని జాతీయ రహదారిపై భారీ వాహనాల రద్దీ చాలా వరకు తగ్గుతుంది.

Updated Date - Feb 05 , 2026 | 01:21 AM