Share News

హైవేపై దారిదోపీడీలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:26 AM

అనకాపల్లి-పెందుర్తి-ఆనందపురం రహదారి (ఎన్‌హెచ్‌ 16)తో పాటు దానికి అనుసంధానంగా సరిపల్లి, పినగాడి, గొరపల్లి, గుర్రంపాలెం ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్‌ రోడ్లలో వరుసగా దోపిడీలు జరుగుతున్నాయి.

హైవేపై దారిదోపీడీలు
పెందుర్తి నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డు

హైవేపై దారిదోపీడీలు

సర్వీస్‌ రోడ్లలో కూడా...

రాత్రిపూట వాహనాలను అడ్డుకుంటున్న దుండగులు

వరుస ఘటనలతో జనం బెంబేలు

కానరాని పోలీస్‌ నిఘా

పెందుర్తి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి-పెందుర్తి-ఆనందపురం రహదారి (ఎన్‌హెచ్‌ 16)తో పాటు దానికి అనుసంధానంగా సరిపల్లి, పినగాడి, గొరపల్లి, గుర్రంపాలెం ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్‌ రోడ్లలో వరుసగా దోపిడీలు జరుగుతున్నాయి. దీంతో చీకటిపడితే ఆ మార్గాల్లో ప్రయాణించడానికి జనం భయపడుతున్నారు. చినముషిడివాడకు చెందిన లారీడ్రైవర్‌ను ఈ నెల రెండో తేదీన ఇద్దరు ఆగంతుకులు కత్తితో బెదిరించి, ముఖంపై పిడిగుద్దులు కురిపించి రూ.600, సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డు లాక్కున్నారు. అంతకుముందు ఇండిగో సంస్థలో లోడర్‌గా పనిచేస్తున్న కరకవానిపాలేనికి చెందిన సంతోశ్‌ బైక్‌పై వస్తుండగా ముగ్గురు దుండగులు అడ్డగించి కత్తులతో బెదిరించి రాళ్లతో దాడికి దిగి డబ్బులు లాక్కున్నారు. రెండు నెలల క్రితం గోవిందపురానికి చెందిన ఆంధ్ర సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుడిని అడ్డగించి నెల జీతం రూ10 వేలు దోచుకున్నారు. అదేవిధంగా జీవీఎంసీ వాటర్‌ సప్లై విభాగం కార్మికుడిపై బ్లేడుతో దాడి చేసి మణికట్టుపై గాయపరిచి రూ.10 వేలు నగదు దోచుకున్నారు. సంవత్సరం కిందట రెండు బైక్‌లపై ఐదుగురు ఆగంతుకులు ఎన్‌హెచ్‌ 16పై సరిపల్లి వద్ద గల బ్రిడ్జి సమీపాన కోనసీమ జిల్లాకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ శ్రీనివాసరావును కత్తులతో బెదిరించి రూ.10 వేలు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. ఇక పోలీసులు దృష్టికి రానివి చాలానే ఉన్నాయి. దొంగలు హైవేలో విద్యుత్‌ దీపాలు వెలగనిచోట, నిర్మానుష్య ప్రాంతాల్లో కాపుగాసి దాడికి పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సరిపల్లి బ్రిడ్జి రోడ్డు, పెందుర్తి రైల్వే స్టేషన్‌ బ్రిడ్జి రూటు, గొరపల్లి సర్వీస్‌ రోడ్డులో ఈ దోపిడీలు అధికంగా జరుగుతున్నాయంటున్నారు. గంజాయికి అలవాటుపడిన యువకులు కొంతమంది ఈ దారిదోపిడీలకు పాల్పడుతున్నట్టు ఇటీవల జరిగిన నేరాల విచారణలో పోలీసులు గుర్తించారు. అయితే నిఘా మాత్రం కానరావడం లేదు. దారిదోపిడీలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 01:26 AM