హైవే దిగ్బంధం
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:46 AM
మండలంలోని పెనుగొల్లు వద్ద వరహా నదిలో ప్రమాదవశాత్తు గల్లంతై మృతిచెందిన ముగ్గురు యువకుల కుటుంబాలు న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆదివారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సుమారు రెండున్నర గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి, ఆయా వాహనాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసు వచ్చి నచ్చజెప్పినా.. ఆందోళనకారులు వినలేదు. హోం మంత్రి అనిత వచ్చి మాట్లాడాలని పట్టుబట్టారు.
వరహా నది ఘటనలో మృతుల కుటుంబాలకు న్యాయంచేయాలని డిమాండ్
పెనుగొల్లు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆందోళన
రెండున్నర గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
హోం మంత్రి అనిత హామీతో ఆందోళన విరమణ
ఎస్.రాయవరం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెనుగొల్లు వద్ద వరహా నదిలో ప్రమాదవశాత్తు గల్లంతై మృతిచెందిన ముగ్గురు యువకుల కుటుంబాలు న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ఆదివారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సుమారు రెండున్నర గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి, ఆయా వాహనాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసు వచ్చి నచ్చజెప్పినా.. ఆందోళనకారులు వినలేదు. హోం మంత్రి అనిత వచ్చి మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నాయకులు మంత్రి అనితకు ఫోన్‌చేసి, ఆందోళనకారులతో మాట్లాడించారు. తన వ్యక్తిగత సొమ్ముతోపాటు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
వరహా నదిలో శనివారం ఈతకు వెళ్లి, నీటిలో మునిగి గల్లంతైన ముప్పిడి నాగవంశీ, కోడి జగదీశ్, కాతేటి రిషి మృతదేహాలను పోలీసు అధికారులు అగ్నిమాపక సిబ్బంది, గత ఈతగాళ్ల సాయంతో ఆదివారం ఉదయం వెలికి తీయించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి తరలిస్తుండగా మృతుల కుటుంబీకులు, బంధువులు, పెనుగొల్లు ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. మృతదేహాల వెలికితీతలో తీవ్ర జాప్యం చేశారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందుతుందని నక్కపల్లి సీఐ రామకృష్ణ, తహశీల్దార్ రమేశ్‌బాబు చెప్పారు. కానీ వారు వినిపించుకోకుండా హోం మంత్రి అనిత ఇక్కడకు రావాలని పట్టుబట్టారు. ఆమె ప్రస్తుతం నియోజకవర్గంలో లేరని అధికారులు చెప్పినా.. వారు వినిపించుకోలేదు. అంతాకలిసి ఉదయం పది గంటల సమయంలో పెనుగొల్లు జంక్షన్ వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై దుంగలు అడ్డుగా పెట్టి బైఠాయించారు. దీంతో అనకాపల్లి వైపు నుంచి తుని వైపు వెళ్లే మార్గంలో జాతీయ వాహనాలు నిలిచిపోయాయి. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావుతో పాటు పాయకరావుపేట, నక్కపల్లి, ఎలమంచిలి ప్రాంతాల సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులుచేరుకున్నారు. డీఎస్పీతోపాటు టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, తదితరులు ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినాసరే వారు ససేమిరా అన్నారు. అమలకంటి అబద్దం, మంత్రి అనితకు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న ఆందోళన గురించి వివరించారు. దీంతో ఫోన్ ద్వారా ఆమె ఆందోళనకారులతో మాట్లాడారు. తన సొంత నిధుల నుంచి బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందించడంతోపాటు ప్రభుత్వం తరపున ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనలు విరమించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి సీహెచ్‌సీ మార్చురీకి పంపించారు. సుమారు రెండున్నర గంటలపాటు జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో మూడు కిలోమీటర్లకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. ఏం జరిగిందో తెలియక ఆయా వాహనాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం
మంత్రి అనిత వీడియో సందేశం
‘‘ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రోయిన్ వద్ద వరహా నదిలో ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతై మృతిచెందడం బాధాకరం. దళిత బిడ్డగా, స్థానిక ఎమ్మెల్యేగా, హోం మంత్రిగా బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత నాపై వుంది. ప్రమాద విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. నా సొంత నిధులు రూ.లక్ష చొప్పున అందజేస్తాను. ప్రభుత్వం నుంచి సాయం అందించడంతోపాటు మృతుల కుటుంబాలకు బాసటగా వుంటాను. బిడ్డలను కోల్పోయిన అమాయక తల్లిదండ్రులను అడ్డంపెట్టుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి కొంతమంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం సరికాదు. బాధిత కుటుంబాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’’ అని మంత్రి అనిత స్పష్టం చేశారు.
ఫొటో-(14ఎస్‌ఆర్‌వీఎం1) ముప్పిడి నాగవంశీ (ఫైల్ ఫొటో)
ఫొటో-(14ఎస్‌ఆర్‌వీఎం2) కోడి జగదీశ్ (ఫైల్ ఫొటో)
ఫొటో-(14ఎస్‌ఆర్‌వీఎం3) కాతేటి రిషి (ఫైల్ ఫొటో)
గల్లంతైన యువకుల మృతదేహాలు వెలికితీత
ఎస్.రాయవరం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెనుగొల్లు గ్రోయిన్ వద్ద వరహా నదిలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గల్లంతైన ముప్పిడి నాగవంశీ (22), కోడి జగదీశ్ (20), కాతేటి రిషి (18) మృతిచెందారు. వీరి మృతదేహాలను ఆదివారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో వెలికి తీశారు. కోడి జగదీశ్, కాతేటి రిషి మృతదేహాలు వీరు నీటిలో మునిగిన ప్రదేశం వద్దనే ఒక గొయ్యిలో లభ్యం కాగా ముప్పిడి నాగవంశీ మృతదేహం వమ్మవరం సమీపంలోని నేస్తాలమ్మ గుడి వద్ద లభ్యమైంది. మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.