Share News

విశాఖకు హై-టెక్‌, హై-పవర్‌ లోకోలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:35 AM

కొత్తవలస-కిరండూల్‌ (కేకే) మార్గంలో గూడ్స్‌ రైళ్లు మరింత వేగంగా పరుగు తీయనున్నాయి.

విశాఖకు  హై-టెక్‌, హై-పవర్‌ లోకోలు

జి 5 లోకో ఇంజన్ల స్థానంలో డి 9 ఇంజన్లు

హార్స్‌పవర్‌ 6 వేలుపైనే..

300 కేటాయింపు

కేకే లైన్‌లో ఇక పరుగులే

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కొత్తవలస-కిరండూల్‌ (కేకే) మార్గంలో గూడ్స్‌ రైళ్లు మరింత వేగంగా పరుగు తీయనున్నాయి. ఆఽదునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యధిక హార్స్‌పవర్‌తో రూపొందించిన 300 ‘డీ9 ఎలక్ట్రిక్‌ లోకో’లను కేంద్రం విశాఖపట్నానికి కేటాయించింది. వీటిలో 15 ఇప్పటికే గుజరాత్‌లోని తయారీ కేంద్రం దాహోడ్‌ నుంచి బయలుదేరాయి. వీటికి 55001 సిరీస్‌ కేటాయించారు.

సరకు రవాణా కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక సామర్థ్యం కలిగిన ఎలక్ర్టిక్‌ లోకో ఇంజన్లను తయారుచేస్తోంది. దేశంలో సరకు రవాణా ద్వారా అధిక ఆదాయం సమకూరుస్తున్న రైలు మార్గాల్లో కేకే లైన్‌ ప్రధానమైనది. కిరండూల్‌ నుంచి ఐరన్‌ఓర్‌ ఈ మార్గంలో విశాఖపట్నం చేరుకొని ఇక్కడి నుంచి పోర్టుల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఈ మార్గంలో ప్రస్తుతం ‘జీ5’ ఎలక్ర్టిక్‌ లోకోలు వినియోగిస్తున్నారు. వీటిని 1980లో ప్రవేశపెట్టారు. బాక్స్‌ మోడల్‌లో ఉండే ఈ ఇంజన్లను ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునేలా రూపొందించారు. ఇవి రైల్వేలో ఐదో తరానికి చెందిన లోకోలు. డీసీ ట్రాక్షన్‌ మోటార్లతో, 3,850 హార్స్‌ పవర్‌తో నడుస్తాయి. వీటిలో చాలా వాటికి వాక్యూమ్‌ బ్రేకులు ఉన్నాయి.

ఇప్పుడు కేంద్రం కొత్తగా కేటాయించిన డి9 ఎలక్ర్టిక్‌ లోకోలు 3 ఫేజ్‌ ఏసీ ట్రాక్షన్‌తో పనిచేస్తాయి. వీటి హార్స్‌పవర్‌ 6 వేలుపైనే. వీటికి అడ్వాన్స్‌డ్‌ రీ జనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేశారు. వీటిని పెద్ద మొత్తంలో ఐరన్‌ఓర్‌, బొగ్గు తరలించానికి ఎక్కువ వ్యాగన్లతో నడపొచ్చు. వీటిని హై-టెక్‌, హై-పవర్‌ లోకోలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో విశాఖపట్నం నుంచి భారీఎత్తున ఖనిజాల రవాణా జరగనున్న నేపథ్యంలో అందుకు తగిన మౌలిక వసతులు సమకూరుస్తూ, వీటిని కేటాయించినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. వీటిని గుజరాత్‌లోని దాహోడ్‌లో ఏడాది క్రితం ఏర్పాటుచేసిన ఎలక్ర్టిక్‌ లోకోమోటివ్‌ తయారీ కేంద్రంలో రూపొందించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద జర్మన్‌ టెక్నాలజీ సాయంతో తయారు చేస్తున్నారు.

Updated Date - Mar 31 , 2026 | 01:35 AM