అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కారు డ్రైవర్ దాష్టీకం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:55 AM
లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అధికారి సమయంలోనే లారీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి
తనిఖీ చేసేందుకు వాహనం ఆపలేదని ఉక్రోశం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
మల్కాపురం పోలీసులకు లారీ అసోషియేషన్ ఫిర్యాదు
హైకోర్టులోనూ పిటిషన్
విచారణకు ఆదే శించిన రవాణా శాఖ కమిషనర్
ఏఎంవీఐకి షోకాజ్... సస్పెండ్ చేసినట్టు ప్రచారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లారీని ఆపలేదనే ఉక్రోశంతో రవాణా శాఖ అధికారి సమక్షంలోనే విచక్షణారహితంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పార్వతి ఈ నెల 20వ తేదీన షీలానగర్ మారుతీ సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఓవర్‌లోడ్, రాంగ్ పార్కింగ్, టార్పాలిన్ కప్పకుండా ముడిసరుకు తరలింపు వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. ఆ సమయంలో చత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ ఒకటి పోర్టు నుంచి లోడ్‌తో వస్తోంది. ఆ లారీని ఏఎంవీఐ పార్వతి, ఆమె కారు డ్రైవర్ శ్రీనివాస్ ఆపారు. డ్రైవర్ ఆపకుండా ముందుకువెళ్లిపోవడంతో కారులో వెంబడించి, కొద్దిదూరంలో లారీని అడ్డుకున్నారు. ఆ వెంటనే ఎంవీఐ వాహన డ్రైవర్ శ్రీనివాస్ లారీ క్యాబిన్‌లోకి ఎక్కి డ్రైవర్ సాహూ ముఖంపై విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించాడు. డ్రైవర్ నోటి నుంచి రక్తం రావడంతో కిందన ఉన్న ఏఎంవీఐ పార్వతి తన కారు డ్రైవర్‌ను కిందకు వచ్చేయాల్సిందిగా కోరారు. అయినా అతను వినలేదు. ఈ ఘటనను లారీ క్లీనర్ వీడియో తీసి లారీ యజమానితోపాటు విశాఖలోని లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులకు షేర్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ కనిపించడం లేదని, రవాణా శాఖ అధికారి సమక్షంలో ఆమె కారు డ్రైవర్ దాడి చేశారని పేర్కొంటూ మల్కాపురం పోలీసులకు విజయవాడలోని లారీ ఓనర్ల సంఘం ప్రతినిధి శేషగిరి ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదుచేసి లారీ డ్రైవర్ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా అతను ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని తీసుకువచ్చేందుకు ప్రత్యేక బృందాలను పంపించారు. డ్రైవర్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును ముందుకుతీసుకువెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు లారీ డ్రైవర్‌పై ఏఎంవీఐ పార్వతి సమక్షంలోనే ఆమె కారు డ్రైవర్ దాడి చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ మనీష్‌కుమార్‌సిన్హా స్పందించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదిక అందజేయాలని రవాణా శాఖ ఉపకమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావును ఆదేశించారు. లారీ డ్రైవర్‌పై దాడి చేయడం వాస్తవమేనని, ఆ సమయంలో ఏఎంవీఐ పార్వతి అక్కడే ఉన్నట్టు పేర్కొంటూ ప్రాథమిక నివేదికను అందజేశారు. హైకోర్టు నుంచి కూడా సమన్లు అందడంతో అమరావతిలోని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శివరామ్‌ప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించారు. శివరామ్‌ప్రసాద్ మంగళవారం నగరానికి వచ్చి ఘటనపై లారీ అసోసియేషన్ ప్రతినిధులను కలిసి సమాచారం సేకరించారు. అలాగే దాడికి గురైన లారీ డ్రైవర్‌కు వీడియో కాల్ చేయగా, తనపై దాడి జరిగినట్టు ఆరోపించారు. దీంతో ఈ ఘటనకు గల కారణం, ఇతర వివరాలను అందజేయాలని కోరుతూ ఏఎంవీఐ పార్వతికి షోకాజ్ జారీచేశారు. ఆమెను సస్పెండ్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పోలీసులు దీనిపై కేసు నమోదుచేసినందున అటు వైపు నుంచి కూడా సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత పూర్తివివరాలతో ఆయన రవాణా శాఖ కమిషనర్‌కు నివేదిక అందించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.