విలీనంపై మహా ఉత్కంఠ
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:29 AM
శివారు మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
శివారు మండలాలను కూడా జీవీఎంసీలో కలపాలని ఎమ్మెల్యేల ప్రతిపాదన
పరిశీలించాల్సిందిగా పైనుంచి ఆదేశాలు
నగర పాలక సంస్థ అధికారులు లేఖ రాసినా ఇంతవరకూ స్పందించని పంచాయతీ అధికారులు
ఎన్‌ఓసీ రాగానే ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్న కమిషనర్
మరోవైపు వార్డులు 120కి పెంచుతూ విభజన చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
శివారు మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై ఉత్కంఠ కొనసాగుతోంది. భీమిలి, పెందుర్తి మండలాల్లోని మిగిలిన గ్రామాలతో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను కూడా జీవీఎంసీలో విలీనం చేయాలని భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై పరిశీలన జరిపి నివేదిక పంపాలని జీవీఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా మండలాల అప్పగింతపై అభిప్రాయం తెలపాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి జీవీఎంసీ అధికారులు లేఖ పంపించారు. అక్కడి నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తుండగానే జీవీఎంసీ పరిధిలో వార్డులను 120కి పెంచుతూ విభజన ప్రకియ జరపాలని ప్రభుత్వం ఆదేశించడం అధికారులను అయోమయానికి గురిచేస్తోంది.
రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత విశాఖ జిల్లా పరిధిలో జీవీఎంసీ పరిధిని మినహాయిస్తే భీమిలి నియోజకవర్గం పరిధిలోని పద్మనాభం, ఆనందపురం మండలాలు పూర్తిగానూ, భీమిలి, పెందుర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా జీవీఎంసీ పరిధిలో విలీనం చేస్తే పాలనాపరంగా సౌలభ్యంగా ఉంటుందని పెందుర్తి, భీమిలి ఎమ్మెల్యేలు పంచకర్ల రమే్‌షబాబు, గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు జిల్లాలోని గ్రామాలను జీవీఎంసీకి అప్పగించడంపై అభిప్రాయం తెలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా పంచాయతీ అధికారికి జీవీఎంసీ అధికారులు లేఖ పంపించారు. దీంతో జీవీఎంసీలో మిగిలిన మండలాల విలీనం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఇంతలో ప్రస్తుత జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120కి పెంచుతూ వార్డుల విభజన పూర్తిచేసి, ప్రజల అభిప్రాయం తీసుకుని ప్రాథమిక నివేదిక పంపించాలని ప్రభుత్వం ఈనెల రెండున ఆదేశించడంతో భీమిలి, పెందుర్తి విలీనం ఇక లేనట్టేనని అంతా భావించారు. ప్రభుత్వం ఆదేశం మేరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు వార్డుల విభజన ప్రక్రియను కూడా దాదాపు పూర్తిచేశారు. 2011 జనాభా లెక్కల ఒక్కో వార్డు పరిధిలో 14,500 నుంచి 17 వేల మంది ఉండేలా విభజన ప్రక్రియను చేపట్టారు. భీమిలి జోన్ పరిధిలో ఐదు, మధురవాడ జోన్ పరిధిలో ఏడు, తూర్పు జోన్ పరిధిలో 18, నార్త్ జోన్ పరిధిలో 20, పశ్చిమ జోన్ పరిధిలో 17, పెందుర్తి జోన్ పరిధిలో ఏడు, గాజువాక జోన్ పరిధిలో 19, అగనంపూడి జోన్ పరిధిలో ఐదు, అనకాపల్లి జోన్ పరిధిలో ఆరు వార్డులు ఉండేలా విభజన ప్రక్రియ ప్రాథమికంగా పూర్తిచేసి నివేదిక తయారుచేశారు. ఆపసోపాలు పడి వార్డుల విభజన ప్రక్రియ చేపట్టిన అధికారులకు ఇటీవల జీవీఎంసీ కమిషనర్ చేసిన ప్రకటన అయోమయంలో పడేసినట్టయింది. జీవీఎంసీ పరిధిలో నాలుగు మండలాల విలీన ప్రక్రియపై జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాశామని, అక్కడి నుంచి ఎన్‌ఓసీ రాగానే ప్రభుత్వానికి నివేదిక పంపించేస్తామని చెప్పారు. దీంతో ప్రభుత్వం విలీనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా? లేక 120 వార్డులతోనే ఎన్నిక నిర్వహిస్తుందా? అనే దానిపై నాయకులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.