Share News

విలువ ఆధారిత ఉత్పత్తులతో అధిక ఆదాయం

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:17 AM

గిరిజన రైతులు విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చునని వ్యవసాయశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ వైవీ రమణారావు సూచించారు.

విలువ ఆధారిత ఉత్పత్తులతో అధిక ఆదాయం
చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీలిస్తున్న డీడీ వైవీ రమణారావు

గిరిజనులకు వ్యవసాయ శాఖ డీడీ వైవీ రమణారావు సూచన

చింతపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులు విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చునని వ్యవసాయశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ వైవీ రమణారావు సూచించారు. బుధవారం మండలంలోని రాజుపాకలులో గిరిజన మహిళా రైతులు నిర్వహిస్తున్న లంబసింగి గిరిజన ఉత్పత్తుల ఎఫ్‌పీవోను స్థానిక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బీవీ తిరుమలరావుతో కలిసి ఆయన సందర్శించారు. తాజాగా ఐఐఎంఆర్‌ రూ.50 లక్షల నిధులతో మంజూరు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌, సోలార్‌ డ్రయర్‌ని ఆయన పరిశీలించారు. మహిళా రైతులు చిరుధాన్యాలు, ఉద్యాన, వ్యవసాయ పంటలతో చేపడుతున్న విలువ ఆధారిత ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహిస్తున్నదన్నారు. వ్యక్తిగత రైతు కంటే రైతులు సమూహంగా ఎఫ్‌పీవోగా ఏర్పడితే బహుళ ప్రయోజనాలు కల్పిస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలను నేరుగా విక్రయించుకోవడం వల్ల అధిక ధర పొందలేకపోతున్నారన్నారు. ఎఫ్‌పీవో ద్వారా మార్కెటింగ్‌ చేసుకోవడం వల్ల అంతర్జాతీయ ధర లభిస్తుందని చెప్పారు. అలాగే ఎఫ్‌పీవో పరిధి రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేయడంతో పాటు విలువ ఆధారిత ఉప ఉత్పత్తులను తయారు చేయడం వల్ల మంచి ధర లభిస్తుందన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలందరూ ఆర్గానిక్‌, చిరుధాన్యాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. గిరిజన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ ప్రగతి సాధించాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో వ్యవసాయశాఖ సైతం ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేస్తుందన్నారు. గిరిజన రైతులు లంబసింగి గిరిజన ఉత్పత్తుల ఎఫ్‌పీవోను సందర్శించి, మహిళా రైతులను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయంలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బీవీ తిరుమలరావు, వ్యవసాయ అధికారి టి. మధుసూదనరావు, ఎఫ్‌పీవో సీఈవో ఇందిరా పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:17 AM